Tejeswar Case: గద్వాల జిల్లా ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ముందుగా తన భార్యనే చంపాలని చూసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆపై తేజేశ్వర్ ను అంతం చేసి ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడని పోలీసులు తేల్చారు. అయితే తన భార్యను చంపితే చెడ్డ పేరు వస్తుందని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు తిరుమలరావు.
తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్రతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించారు. అప్పటికే స్థానికుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో ప్రేమాయణం సాగించిన ఐశ్వర్య పెళ్లిని రద్దు చేయించింది. ఆమెనే భార్యగా ఊహించుకుంటున్న తేజేశ్వర్ పెళ్లి రద్దుతో మనోవేదనకు గురయ్యాడు. అనూహ్యంగా మే నెలలో తేజేశ్వర్ కు ఫోన్ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కట్నకానుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి వద్దన్నానని నమ్మించింది. ఇదంతా నమ్మేసిన తేజేశ్వర్ ఎలాంటి కానుకలు లేకుండా మే 18న బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు.
తేజేశ్వర్ తో ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయం కాగానే తిరుమలరావు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, అతడి కుటుంబంలో ఘర్షణలు తలెత్తడంతో అక్కడ ఉండటం ఐశ్వర్యకు వీలు కాలేదు. దీంతో తిరిగి తేజేశ్వర్ నే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించింది. తర్వాత కర్నూలులోనే కాపురం పెడితే ప్రియుడిని ఎప్పటిలానే కలుసుకోవచ్చని కుట్ర పన్నింది. అయితే, తేజేశ్వర్ గద్వాల్ లోనే కాపురం ఉండటంతో ప్రియుడిని కలుసుకోవటం వీలు కాలేదు. దీంతో తేజేశ్వర్ ను హత్య చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావు కర్నూల్ కి చెందిన ఓ సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నారు.
ఆపై అతడి బైక్ కి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అనంతరం సుపారీ గ్యాంగ్ తేజేశ్వర్ ను హత్య చేసేందుకు ఐదుసార్లు రెక్కీ నిర్వహించారు. అది వీలు కాకపోవటంతో ఆ గ్యాంగ్ తమ భూమి సర్వే చేయాల్సి ఉందని ఈ నెల 17న తేజేశ్వర్ ను సంప్రదించారు. అది నమ్మేసిన తేజేశ్వర్ వారితో పాటు కారులో వెళ్లాడు. తొలుత ఇటిక్యాల మండలం మొగిలిరావు చెరువువైపు, తర్వాత గద్వాల మండలం వీరాపురం తీసుకెళ్లారు. అక్కడే కృష్ణ స్వామి ఆలయం సమీపంలో కారులోనే మారణాయుధాలతో చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కృష్ణా నదిలో ఆయుధాలను, తేజేశ్వర్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను పడేశారు. ఆపై తిరుమలరావుకి సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన తిరుమలరావు తేజేశ్వర్ మృతిని నిర్ధారించుకున్నాడు. హత్య చేసినందుకు సుపారీ గ్యాంగ్ కు 2లక్షలు ఇచ్చాడు. నంద్యాలకు దగ్గరలోని పాండ్యం అటవీ ప్రాంతంలో రహదారి పక్కన తేజేశ్వర్ మృతదేహాన్ని పడేశారు. పెళ్లైన 29 రోజుల్లో దాదాపు 15 రోజులు ఐశ్వర్య కర్నూల్ లోనే ఉంది. బ్యాంకు ఉద్యోగితో 4 నెలల్లో దాదాపు 2వేల వరకు ఫోన్ కాల్స్ మాట్లాడింది.