Bollywood Director Cheated A Woman
Bollywood Director cheated a woman,by the name of cinema chance : బాలీవుడ్ సినిమాల్లో తన కూతురికి హీరోయిన్ గా చాన్స్ ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద నుంచి రూ.3.5లక్షలు తీసుకుని మోసం చేసిన టీవీ సీరియల్స్ డైరెక్టర్ , మేకప్ ఉమెన్ ల ఉదంతం ముంబై లో వెలుగు చూసింది.
గుజరాత్, వడోదరకు చెందిన ప్రేమలతా శర్మ సుభన్ పురా లో నివసిస్తున్నారు. ఆమెకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. శర్మకు కొన్ని నెలల క్రితం మేకప్ ఆర్టిస్ట్ భూమి పాఠక్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం అయినప్పుడు శర్మ కూతుర్ని చూసిన భూమి నీ కూతురిని హీరోయిన్ను చేయమని సలహా ఇచ్చింది.
ముంబై సిటీ స్టూడియోలో త్వరలో ఆడిషన్స్ జరుగుతాయని వాటిలో పాల్గోమని సలహా ఇచ్చింది. అందులో సెలెక్ట్ అయితే ముందు సీరియల్ లో పాత్ర ఇస్తారని భూమి చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఆమెకు సమాచారం వచ్చింది.
భూమి సీరియల్ లో చాన్స్ ఇప్పించినందుకు రూ.50 వేలు ఇవ్వాలని కోరింది. ప్రేమలత, భూమికి 49 వేలు చెల్లించింది. తర్వాత తన కుమార్తెను తీసుకుని ఆమె ముంబై వెళ్లింది. అక్కడ భూమి, సీరియల్స్ డైరెక్టర్ అయిన సుబోధ్ కుమార్ ని పరిచయం చేసింది.
సుబోధ్, ప్రేమలత శర్మ కుమార్తె ఫోటోలు చూసి హీరోయిన్ గా అవకాశం ఇప్పించాలంటే రూ.3 లక్షలు కావాలని అడిగాడు. శర్మ వారికి ఆమొత్తం చెల్లించి తన కుమార్తెను హీరోయిన్ని చేయమని కోరింది.
డబ్బులిచ్చి నెలలు గడుస్తున్నా తన కుమార్తెకు సుబోధ్ కానీ, భూమి పాఠక్ కానీ అవకాశాలు ఇప్పించలేదు. ఎన్ని సార్లు అడిగినా ఆ విషయమై వాళ్లు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరగటంతో తాను మోసపోయానని గ్రహించింది.
ఏప్రిల్ 1వ తేదీ, గురువారం రాత్రి ఆమె వడోదరలోని గోర్వా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భూమి పాఠక్, సుబోధ్ కుమార్ పాఠక్ లు తనను రూ. 3.52 లక్షలకు మోసం చేసినట్లు తన ఫిర్యాదులో పేర్కోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.