ఇద్దరు చిన్నారుల కిరాతక హత్య.. హంతకుడిని ఎన్‌కౌంట‌ర్‌ చేసిన పోలీసులు

వాళ్లిద్దరూ ఎందుకిలా చేశారో అంతుపట్టడం లేదు. వాళ్లతో నాకు ఎటువంటి గొడవలు లేవు.

Budaun double murder case: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ సిటీలో ఇద్దరు చిన్నారుల దారుణ హత్య భయాందోళన రేపింది. హంతకుడిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మార్చారు. హంతకుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై వివరాలు వెల్లడికాలేదు. క్షుద్రపూజల కోసమే హత్యచేశాడన్న వాదనలను పోలీసులు తోసిపుచ్చారు. చిన్నారుల తండ్రితో హంతకుడికి ఉన్న గొడవల నేపథ్యంలోనే ఈ జంట హత్యలు జరిగివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హంతకుడితో తనకెటువంటి గొడవలు లేవని చిన్నారుల తండ్రి చెప్పాడు.

అసలేం జరిగింది?
మహ్మద్ సాజిద్(22) అనే యువకుడు బదౌన్‌ సిటీలోని బాబా కాలనీలో బార్బర్ షాపు నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం తన దుకాణానికి ఎదురుగా ఉన్న వినోద్ ఠాకూర్ ఇంటికి వెళ్లి రూ.5 వేలు అప్పుగా అడిగాడు. వినోద్ ఇంట్లో లేకపోవడంతో అతడి భార్య సంగీత.. సాజిద్‌కు డబ్బులు ఇచ్చింది. తాగడానికి టీ తీసుకొస్తానని ఆమె వంటగదిలోకి వెళ్లింది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. వినోద్ ముగ్గురు పిల్లలపై కత్తితో సాజిద్ కిరాతకంగా దాడి చేశాడు. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం బైక్‌పై బయట వేచి ఉన్న తన సోదరుడు జావేద్‌తో కలిసి సాజిద్ పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో సాజిద్ హతమయ్యాడు. జావేద్ పారిపోయాడని, సాజిద్ కాల్పుల్లో గాయపడ్డ ఎస్సై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని బదౌన్‌ పోలీసులు తెలిపారు.

ఎటువంటి గొడవలు లేదు: వినోద్
సాజిద్‌తో తనకు ఎటువంటి వివాదాలు లేవని పోలీసులతో వినోద్ ఠాకూర్ చెప్పారు. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు తాను బయట ఎక్కడో ఉన్నానని తెలిపారు. తన కుమారుల్లో ఒకరు సాజిద్‌ బారి నుంచి తప్పించుకుని సంగీతను అలర్ట్ చేయడంతో ఆమె సురక్షితంగా బయటపడిందని వెల్లడించారు. నిందితులు ఎందుకు ఇలా చేశారో తెలియడం లేదని అన్నారు.

 

స్థానికుల ఆందోళన
ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేయడంతో స్థానికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. సాజిద్ బార్బర్ దుకాణాన్ని తగలబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షుద్రపూజల నేపథ్యంలో చిన్నారులను బలి తీసుకున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సీనియర్ పోలీసు అధికారి అలోక్ ప్రియదర్శిని ఖండించారు. రుమార్లను ప్రచారం చేసే వారిపై నిఘా పెట్టినట్టు వెల్లడించారు.

కంగారుగా కనిపించాడు: సంగీత
డబ్బు కోసం తన దగ్గరకు వచ్చిన సాజిద్ కంగారుగా కనిపించాడని సంగీత వెల్లడించారు. ”గర్భవతి అయిన తన భార్య ఆసుపత్రిలో ఉందని, రూ.5 వేలు అప్పుకావాలని నన్ను సాజిద్ అడిగాడు. నేను వెంటనే వినోద్‌కు ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వమని చెప్పాడు. దీంతో అతడికి డబ్బులు ఇచ్చాను. ఆ సమయంలో అతడు చాలా ఆందోళనగా ఉన్నాడు. రాత్రి 11 గంటలకు తన భార్యకు డెలివరీ అవుతుందని చెప్పాడు. కంగారుపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పి, తాగడానికి టీ ఇచ్చాను. తర్వాత అతడు మా అబ్బాయితో కలిసి మేడపైకి వెళ్లాడ”ని సంగీత మీడియాకు వివరించారు.

లైట్లు ఆఫ్ చేసి ఘాతుకం
మేడపైన ఉన్న తన తల్లి బ్యూటీ సెలూన్‌ను చూపించమని సంగీత కుమారుడైన 11 ఏళ్ల ఆయుష్‌ని అడిగాడు సాజిద్. బాలుడు అతన్ని మొదటి అంతస్తుకు, ఆపై రెండవ అంతస్తుకు తీసుకెళ్లాడు. రెండో అంతస్తులో సాజిద్ లైట్లు ఆఫ్ చేసి ఆయుష్‌పై కత్తితో దాడి చేశాడు. తర్వాత ఆయుష్‌ తమ్ముడు అహాన్ (6) లోపలికి రావడంతో అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. సంగీత మరో కుమారుడు పియూష్‌(7) సాజిద్ బారి నుంచి తప్పించుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయుష్‌, అహాన్ ప్రాణాలు కోల్పోయారు.

తగిన శాస్తి జరిగింది: సాజిద్ తల్లి
జంట హత్యలపై సాజిద్, జావేద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల తండ్రిని ప్రశ్నించారు. కాగా, తన కొడుకులు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అంతుచిక్కడం లేదని నిందితుల తల్లి నజిన్ వాపోయింది. “వారు ఎందుకిలా చేశారో నాకు తెలియదు. ఉదయం 7 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మా ఇంట్లో ఎటువంటి టెన్షన్ లేద”ని ఆమె చెప్పారు. సాజిద్ ఎన్‌కౌంట‌ర్‌ను ఆమె సమర్థించారు. ఇద్దరు పిల్లలను బలితీసుకున్న తన కుమారుడికి తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. చిన్నారుల కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు