బాబోయ్ లారీలు.. హైవేలపై ప్రాణాలు ఆగిపోతున్నాయ్

హైదరాబాద్- విజయవాడ హైవేపై లారీలు భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న లారీలు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి.

Car Rams into Parked Lorry: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా తిరిగి వెళతామన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రతి రోజు జరుగుతున్న యాక్సిడెంట్లు భయాందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ హైవేపై అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపైనా యాక్సిడెంట్లు ఎక్కువగానే అవుతున్నాయి.


విషాద ఘటన.. ఆరుగురు దుర్మరణం

హైవేపై ఆగివున్న లారీలు పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్- విజయవాడ హైవేపై కోదాడ పట్టణం పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉంది.


మంటల్లో కారు, లారీ.. ఒకరు మృతి

పటాన్‌చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్- 3 సమీపంలో గురువారం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టిన ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. లారీని ఢీకొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయింది. మంటలు అంటుకోవడంతో లారీకి కూడా లోడుతో సహా తగలబడిపోయింది.


కంటెయినర్ కిందకు దూసుకుపోయి..

హైదరాబాద్- విజయవాడ హైవేపై సోమవారం జరిగిన మరో ఘోర ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ముకుందాపురం సమీపంలో ఆగివున్న కంటెయినర్ లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టి.. దానికి కిందకు దూసుకెళ్లింది. కంటెయినర్ కింద కారు ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Also Read: దారుణం.. చెల్లి పెళ్లికి గిఫ్ట్‌లు ఇస్తున్నాడని భర్తను చంపించిన భార్య

యాక్సిడెంట్లు ఆగాలంటే..?
హైవేపై నిలిపివుంచుతున్న లేదా ఆగిపోయిన భారీ వాహనాల కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆగివున్న వాహనాలకు స్టాప్ సిగ్నల్ వేయకపోవడం, రోడ్లపై వెలుతురు సరిగా లేకపోవడం, ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయడం, అతివేగంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు కార్లు నడిపేవారికి సరైన అనుభవం లేకపోవడం కూడా ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి. రద్దీ రహదారులపై భారీ వాహనాలను పార్కింగ్ చేయకుండా చూడడం, ఒకవేళ ఏదైనా వెహికిల్ ఆగిపోతే వెంటనే దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాహనదారులను అలర్ట్ చేసేలా సూచికలు ఏర్పాటు చేయడం, అతివేగాన్ని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు