Soft Ware Engineer Cheated Women
Women Cheater : అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… అందగాడు… మంచి జీతం..జీవితం హ్యాపీగా గడిచిపోతుందని మాయమాటలు చెప్పి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే నిత్యపెళ్లి కొడుకు బండారం గుంటూరు జిల్లాలో బయట పడింది. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదో పెళ్లికి రెడీ అయిన నిత్య పెళ్లికొడుకు పై నాలుగో పెళ్లాం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన యువకుడు అమెరికాలో సాఫ్టేవేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యవర్తుల ద్వారా అతని తల్లితండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయి అమెరికాలో సాఫ్టే వేర్ ఇంజనీర్ అని అందగాడని.. మంచి ఆదాయం ఉందని చెప్పి సంబంధం కుదుర్చుకుంటారు. అబ్బాయి సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు.
నెల రోజులు కాపురం చేశాక…. సెలవలు లేవని….మళ్లీ వచ్చినప్పుడు అమెరికా తీసుకువెళ్తానని చెప్పి నిందితుడు అమెరికా వెళ్లిపోతాడు. ఆతర్వాత ఇక అత్తమామలు, భర్త నుంచి సరైన సమాధానం ఉండదు. ఇలా నలుగురిని మోసం చేసి ఐదో పెళ్లికి సిధ్దమయ్యాడా నిత్య పెళ్లి కొడుకు.
నిందితుడు చదువు పూర్తై అమెరికా వెళ్లాక అక్కడ గ్రీన్ కార్డు హోల్డరైన యువతిని వివాహం చేసుకున్నాడు. 13 ఏళ్ల క్రితం విశాఖపట్నానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని ఆమెను వదిలేశాడు.
ఆ తర్వాత మూడేళ్ళకు ఆమె బంధువును పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత నరసరావు పేటకు చెందిన మరోక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి నిత్యపెళ్లి కొడుకు నిర్వాకం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఇండియా రాగానే అతడి పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట యువతితో రాజీ చేసుకుని పాస్ పోర్టు తీసుకుని అమెరికా వెళ్లిపోయాడు.
తిరిగి 2019 లో గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతికి మాయమాటలు చెప్పి రూ.25 లక్షలు కట్నం తీసుకుని నాలుగో పెళ్లి చేసుకున్నాడు. నెల రోజుల పాటు ఆమెతో కాపురం చేశాడు. మరో నెల తర్వాత వచ్చి తీసుకువెళతానని… సెలవలు లేవని చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు. నెలలు గడుస్తున్నా ఇండియా వచ్చి భార్యను అమెరికా తీసుకు వెళ్లలేదు. ఫోన్ చేసినా స్పందించటంలేదు.
ఈ విషయమై అత్తమామలను అడిగినా పొంతనలేని సమాధానాలు చెప్పటం మొదలెట్టారు. దీంతో అనుమానం వచ్చిన నాలుగో భార్య కుటుంబ సభ్యులు నిందితుడి గురించి ఎంక్వైరీ చేయగా ఇదే తరహాలో వివాహాలు చేసుకుని ఇంతకు ముందు నలా మోసాలు చేసినట్లు గుర్తించారు.
ఇలా ఉండగా.. గుంటూరు కు చెందిన నాలుగో భార్యకు తెలియకుండా డిసెంబర్ 2020లో ఇండియా వచ్చి విజయవాడకు చెందిన మరోక యువతితో నిశ్చితార్ధం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. త్వరలో వివాహం చేసుకోటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుసుకున్న నాలుగో భార్య సోమవారం నిందితుడిపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.