కొలంబో: ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లుతున్న శ్రీలంకలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయటానికి నిరాకరించిన పోలీసు బాస్ (IGP-Inspector General of Police) పుజిత్ జయసుందర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడులు జరుగుతాయని నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించిన కారణంగా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
డీఐజీ చందన విక్రమ రత్నేను యాక్టింగ్ పోలీసు చీఫ్ గా శ్రీలంక అధ్యక్షుడు శిరిసేన నియమించారు. కాగా ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి దేశంలో అత్యయిక పరిస్ధితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన ప్రకటించారు. ఇప్పటికే దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ముసుగు వేసుకుని సంచరించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. మరో వైపు ముఖాన్ని కప్పుతూ ఉండేలా దుస్తులు ధరించవద్దని శ్రీలంకలోని ఓ ముస్లిం సంస్థ కూడా ప్రజలకు సూచించింది.