Harassing Girls: ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలాగా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, అమ్మాయిల్నే వేధించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీకి చెందిన పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు.
అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. అన్నీ… అమ్మాయిల పేర్లతోనే. దీంతో తన ఫాలోవర్లను తాను అమ్మాయి అని నమ్మించేవాడు. అలా యువకులతో పరిచయం పెంచుకునే వాడు. తర్వాత ఆ యువకుల దగ్గరి నుంచి వాళ్లకు తెలిసిన అమ్మాయిల ఫొటోలు, వివరాలు సేకరించేవాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ అమ్మాయిల్ని వేధించేవాడు. వాళ్లకు సంబంధించి అభ్యంతరకర ఫొటోలు క్రియేట్ చేసి వాళ్లను బెదిరించేవాడు. వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసేవాడు. దీంతో బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపారు. వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఐఫోన్, సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడి మొబైల్ ఫోన్‌లో 50 మందికిపైగా అమ్మాయిల ఫొటోలు ఉన్నాయి. నిందితుడు ఢిల్లీలోని అనేక పెద్ద సంస్థలకు ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.