Dowry Harassment, wife protest in front of husban house : రంగారెడ్డి జిల్లా, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులకు పాల్పడుతున్న అత్తింటి ముందు బాధితురాలు ధర్నాకు దిగింది. తనను వేధింపులకు గురి చేసిన అత్త,మామ మరియు బావ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. మీర్ పేట వినాయక హిల్స్ లో నివసించే క్రాంతి కుమార్ అనే వ్యక్తి, మూడు సంవత్సరాల క్రితం మిర్యాలగూడకు చెందిన సంధ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్న క్రాంతి కుమార్ కు పెళ్లి సమయంలో కట్నం కింద 10 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, ఇంటిలోకి సరిపడా ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా అత్తమామ, బావ లు అదనపు కట్నం తేవాలని వేధించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
లా ఎగ్జామ్స్ కోసం అని పుట్టింటికి వెళ్ళిన సమయంలో భర్త విడాకుల నోటీసు పంపించారని ఆమె ఆరోపించింది. విడాకుల విషయం గురించి అడుగుదామంటే తన భర్త గత నాలుగు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆమె వాపోయింది. విషయం అడుగుదామని ఇంటికి వస్తే అత్తమామలు, భర్త, బావలు ఇంట్లోకి రానివ్వటం లేదని ఆమె ఆరోపించింది. తన భర్త తనకు కావాలని, ఇంట్లోకి రానివ్వాలని, లేకపోతే..తనకు న్యాయంజరిగే వరకు ఇంటి ముందు దీక్షకు దిగుతానని సంధ్య తెలిపింది.