డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి..!

  • Publish Date - October 22, 2020 / 06:07 PM IST

Dr Reddy cyber-attack : ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో వెల్లడించింది.



తమ సంస్థకు సంబంధించి ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగిందని గుర్తించినట్టు డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమైన నివారణల చర్యల్లో భాగంగా అన్ని డేటా సెంటర్లను ప్రత్యేకంగా ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది.

అయితే సంస్థ కార్యకలాపాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని సంస్థ సీఐఓ ముఖేశ్ రాథి ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో సంస్థ కార్యకలాపాలు యథాస్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తోంది.



రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ -V వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భారతదేశంలో నిర్వహించడంతో పాటు వ్యాక్సిన్ ఇక్కడ సరఫరా చేసేందుకు RDIFతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.



క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ మధ్యే భారత నియంత్రణ సంస్థ నుంచి కూడా డాక్టర్ రెడ్డీస్ అనుమతి పొందింది. ఇలాంటి సమయంలో సంస్థ ఐటీ విభాగాలపై సైబర్ దాడి ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.



డాక్టర్ రెడ్డీస్ సైబర్ దాడి ఘటనతో సంస్థ షేర్ ధర ఒక్కసారిగా పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ స్టాక్ బీఎస్ఈపై ఉదయం 11 గంటల సమయంలో 1.19శాతం తక్కువ క్షీణించి రూ.4,986.90 ట్రేడింగ్ అయింది.