DRI Mumbai: వామ్మో.. ఆ వ్యక్తి కడుపులో కిలో కొకైన్ క్యాప్సుల్స్.. దాని విలువ 11 కోట్లు..

ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడిపై అధికారులకు ఎందుకో అనుమానం కలిగింది. అంతే, ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

DRI Mumbai: క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసుల కన్నుగప్పి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ క్రిమినల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎంతో రహస్యంగా మాదకద్రవ్యాలను తీసుకొచ్చిన అతడు అధికారులకు చిక్కాడు. ముంబై ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన కడుపులో భారీగా కొకైన్ క్యాప్సుల్ తీసుకొచ్చాడు. ఆ కొకైన్ బరువు కేజీపైనే కాగా, దాని విలువ 11 కోట్ల పైమాటే.

ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా కొకైన్‌ పట్టుబడింది. కొకైన్‌ క్యాప్సుల్‌ను మింగి ప్రయాణిస్తున్న వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతడి పొట్టలో నుంచి 1,139 గ్రాముల మాదకద్రవ్యాలున్న 67 క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.39 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితుడిని ఐవరీకోస్ట్‌ జాతీయుడిగా గుర్తించారు.

సియెర్రా లియోన్‌ నుంచి ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడిపై అధికారులకు ఎందుకో అనుమానం కలిగింది. అంతే, ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం విచారించారు. దీంతో మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడింది. మాదకద్రవ్యాలతో కూడిన క్యాప్స్యూల్స్‌ను తీసుకున్నట్లు అంగీకరించాడు. పోలీసులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు. ఆసుపత్రి సిబ్బంది ఆ వ్యక్తి కడుపు నుంచి క్యాప్యుల్స్‌ను బయటకు తీశారు. దాదాపు రూ.11కోట్లు విలువైన వాటిని స్వాధీనం చేసుకున్న నార్కొటిక్స్‌ అధికారులు.. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.