పంజాబ్ కు చెందిన డ్రగ్ ఇన్స్ పెక్టర్ దారుణహత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి తన ఆఫీసులోకి చొరబడి ఆమెపై రెండు సార్లు కాల్పులు జరిపాడు.
ఓ హత్య.. దేశాన్ని కదిలిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో సంచలనం. రాజకీయ పార్టీల్లో దుమారం. హత్యకు గురైంది ఎవరో కాదు.. చంఢీఘడ్ జోనల్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ నేహా షోరే. ఆమెను ఆమె ఆఫీసులోనే కాల్చి చంపారు. డ్రగ్స్ సరఫరాపై కఠిన చర్యలు చేపట్టటం వల్లే ఈ హత్య అని అనుమానిస్తున్నారు. దీని వెనక మాఫియా ఉందని అనుమానిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి.. నేహా షోరే ఆఫీసులోకి చొరబడి రెండు సార్లు కాల్పులు జరిపాడు. స్పాట్ డెడ్. కాల్పులు జరిపిన అనంతరం.. దుండగుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. అదే సమయంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించగా.. నిందితుడు తనను తానే కాల్చేసుకున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ప్రాణపాయ స్థితిలో ఉన్న నిందితుడిని చండీగఢ్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. డ్రగ్ ఇన్స్ పెక్టర్ నేహా షోరే హత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఖరార్ లోని డ్రగ్ అండ్ ఫుడ్ కెమికల్ ల్యాబరేటరీలో జోనల్ లైసెన్సింగ్ అధికారిగా పనిచేస్తోంది ఆమె. డ్రగ్ ఇన్స్ పెక్టర్ నేహా హత్యకేసుపై విచారణ చేపట్టాల్సిందిగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు.
నేహా హత్యతో పంజాబ్ లో చర్చనీయాంశం అయ్యింది. దీని వెనక డ్రగ్స్ మాఫియా ఉందనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.