Drushyam Style Incident: దృశ్యం సినిమాలో ఓ వ్యక్తిని హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసిన సీన్ సినిమాకే హైలైట్. అతడు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియనివ్వరు. మర్డర్ కి సంబంధించి ఒక్క ఆధారం కూడా దొరకనివ్వరు. సరిగ్గా ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది. శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తిని చంపి చెరువులో పడేశారు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. రెండేళ్ల తర్వాత అదృశ్యమైన వ్యక్తి మర్డర్ అయ్యాడని బయటపడింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు.
2023లో నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో అమర్నాథ్ అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. అతడి కుటుంబసభ్యులు నల్లచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అమర్నాథ్ ఏమయ్యాడో ఎవరికీ అంతుచిక్కలేదు. రెండేళ్ల తర్వాత మిస్టరీ వీడింది. అమర్నాథ్ ను హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఓ మహిళ స్నానం చేస్తుండగా అమర్నాథ్ వీడియో తీశాడు. తన కోరిక తీర్చాలని ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేశాడు. అమర్నాథ్ లైంగిక వేధింపులు తాళలేకపోయిన మహిళ.. తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అమర్నాథ్ ను లేపేయాలని అతడు డిసైడ్ అయ్యాడు. మరో ఇద్దరితో కలిసి అమర్నాథ్‌ను మహిళ భర్త హత్య చేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని చర్లోపల్లి చెరువులో పడేశాడు.
అది జరిగిన రెండేళ్లకు నల్లచెరువు పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమర్నాథ్‌ను హత్య చేసిన దుండగుల వివరాలు కనుగొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు నేరాన్ని అంగీకరించారు.
Also Read: అల్లరి చేస్తోందని.. మేనమామ, అత్తలే చంపేశారు.. మాదన్నపేట బాలిక హత్య కేసులో సంచలన విషయాలు..