Disha Encounter
Sirpurkar Commission : దిశ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత తన మానసికి స్ధితి బాగోలేదని తాను ఒత్తిడికి లోనై, గందరగోళానికి గురవటం వలన ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన విషయాలను సరిగా నమోదు చేయలేకపోయానని అప్పటి షాద్ నగర్ ఏసీపీ సురేందర్ తెలిపారు.
దిశ అత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్న సిర్పూర్‌కర్ కమీషన్ ఎదుట ఆయన సోమవారం హజరయ్యారు. నిందితులను సంఘటనా స్ధలానికి తీసుకు వెళ్లినప్పుడు తమ కళ్లలో మట్టి కొట్టి రివాల్వర్లు లాక్కోన్నారని… అందుకే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎన్‌కౌంటర్ కేసు నమోదు చేశారు. కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదులో కానీ తర్వాత ఇచ్చిన ఫిర్యాదులో కానీ ఎక్కడా నిందితులు మట్టి చల్లినట్లు, కాల్పులు జరిపినట్లు ఎందుకు పేర్కోలేదని కమీషన్ సురేందర్‌ను ప్రశ్నించింది. ఆ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత తన మానసిక స్ధితి సరిగా లేకపోవటం వలన…మానసిక ఒత్తిడికి లోనై గందరగోళానికి గురవటం వల్ల వాటిని పేర్కోనలేక పోయానని సురేందర్ సమాధానం చెప్పారు.
Also Read : China Vaccination for Above 3 Years : మూడేళ్ల చిన్నారులకు టీకా వేసేందుకు చైనా ప్రయత్నాలు
ముందు ఎవరు మట్టి చల్లారు… ఎవరెవరి కళ్లల్లో మట్టి పడింది… ఎవరు కాల్పులు జరిపారు అని కమీషన్ ప్రశ్నించగా….. చీకటిగా ఉండటంతో ఏం జరుగుతోందో సరిగా చూడలేకపోయానని ఆయన కమీషన్‌కు సమాధానం చెప్పారు. నిందితులను భయపెట్టే ఉద్దేశ్యంతోనే కాల్పులు జరపమని తన సిబ్బందికి తాను ఆదేశాలు ఇచ్చానని ఆయన తెలిపారు.
తన సిబ్బందిలో లాల్ మదార్ మొదట కాల్పులు జరిపాడని.. మాతో పాటు సాక్షులు ఉన్నారని వారిని కూడా రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని… అందుకే శబ్దం వస్తున్న వైపు కాల్పులు జరపమని ఆదేశాలు ఇచ్చానని సురేందర్ చెప్పుకొచ్చారు. ఇది నిజ నిర్ధారణ కమీషన్ ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకోండి అని బాంబే హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా సొండూర్-బల్డోటా సురేందర్ తో అన్నారు.
నాజీవితంలో మొదటి సారిగా నేను సుప్రీం కోర్టు న్యాయమూర్తి, మరియు బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నాను. నేను చాలా ఒత్తిడికి లోనయ్యానని సురేందర్ వారితో అన్నారు. కాగా… కమీషన్ సభ్యుడు మరియు సీబీఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ కార్తికేయన్… ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి ముందు కళ్లు మూసుకుని రెండు,మూడు సార్లు లోతైన శ్వాస తీసుకుని మీఇష్ట దైవాన్నిప్రార్ధించుకోండి అని సూచించారు.