Family Suicide In Vijayawada
Vijayawada : విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం వన్‌టౌన్‌లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో బస చేశారు.
నిజామాబాద్ లో పెట్రోల్ బంక్, మెడికల్ షాపు నిర్వహించే పప్పుల సురేష్ తన భార్య ఇద్దరు కుమారులతో విజయవాడ వచ్చారు. కుటుంబ సభ్యులు నిన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నట్లు తెలిసింది. నిన్న అర్ధరాత్రి తల్లి, చిన్న కొడుకు విషతాగి సత్రంలో ఆత్మహత్య చేసుకోగా.. పెద్ద కొడుకు, తండ్రి ప్రకాశం బ్యారేజి 52 వ పిల్లర్ నుంచి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా… నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో మృతులు వారి కుటుంబీకులకు తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక వాయిస్ మెసేజ్ పంపించినట్లు తెలిసింది.
కంగారు పడిన వారు వెంటనే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిన్న రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. ఈ రోజు ఉదయానికి వారు కన్యకాపరమేశ్వరి సత్రంలో దిగినట్లు గుర్తించి తలుపులు పగలకొట్టి చూడగా తల్లి కొడుకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
Also Read : India Covid Update : భారత్‌లో లక్ష 50 వేలకు చేరువలో కోవిడ్ కేసులు
మరో వైపు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తండ్రి కొడుకు మృతదేహాలన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించి కృష్ణా నది నుంచి వెలికి తీశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఆర్ధిక ఇబ్బందుల వల్లే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.