ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల్ని మోసగించటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగార్ధుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు కారణమైన వ్యక్తులు, వ్యవస్ధలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
రాజ్‌భవన్‌లో మెసర్స్ సుమతి కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఔట్‌సోర్సింగ్ సేవలందిస్తోంది. అటెండర్లు, రిసెప్షనిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టుల నియామకం ఈ ఏజెన్సీ ద్వారా చేపడుతున్నారు. ఈ కంపెనీకి చెందిన కొందరు పర్యవేక్షకులు, ప్రొటోకాల్ సిబ్బంది కలిసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని రాజ్‌భవన్ అధికారులకు ఇటీవల పిర్యాదు అందింది. 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని సుమతి ఏజెన్సీ మేనేజర్ మునిశంకర్‌పై గవర్నర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో గవర్నర్ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రెండ్రోజుల పాటు సాగిన విచారణలో ఉద్యోగాల పేరిట వసూళ్లు నిజమేనని కమిటీ సభ్యులు తేల్చారు.
రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమతి కార్పొరేట్ పర్యవేక్షక సిబ్బందితో పాటు మరికొందరు దళారులు కలిసి మొత్తం తొమ్మిది మంది నుంచి నగదు వసూలు చేసిన విషయాన్ని కమిటీ గుర్తించింది. వారి అభియోగాలను నమోదు చేసింది. ఈ నివేదికను గవర్నర్ హరిచందన్‌కు సమర్పించగా… ఆయన ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్ భవన్ వంటి కార్యాలయం విషయంలోనూ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన ఏజెన్సీ పర్యవేక్షకులు, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గవర్నర్ రాజ్ భవన్ కార్యదర్శిని ఆదేశించారు. విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావును రాజ్ భవన్‌కు పిలిపించి మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ దందాకు తెరలేపిన సుమతి సంస్థ మేనేజర్ మునిశంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More : 11 నుంచి స్విగ్గీ సేవలు బంద్