ఓవర్ స్పీడ్ : గచ్చిబౌలి బయోవర్సిటీ ఫ్లై ఓవర్‌ నుంచి కిందపడిన కారు

  • Publish Date - November 23, 2019 / 08:30 AM IST

గచ్చిబౌలి బయో వర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఓ కారు కింద పడింది. కారులో ఉన్న ముగ్గురికి, కింద ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఫ్లై ఓవర్ కింద వేచి ఉన్న మహిళపై కారు పడడంతో ఆమె అక్కడికక్కడనే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. కింద పడిన కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మహిళ, కారులో ఉన్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

అతివేగం వల్ల కారు అదుపు తప్పి ప్రమాదం జరిగిందా ? తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని భావిస్తున్నారు. ఎత్తైన ఫ్లై ఓవర్ నుంచి కింద పడడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఘటనా  ప్రదేశంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలైనట్లు, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. 

గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఓవర్ స్పీడ్‌తో వెళుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ఖాళీగా ఉండడంతో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నారు. స్పీడ్ టెస్టు పరికరాలు లేకపోవడం వల్ల ఓవర్ స్పీడ్‌తో వెళుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. ఈ ఫ్లై ఓవర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
Read More : మాస్క్ మస్ట్ : గ్రేటర్‌లో పెరుగుతున్న కాలుష్యం