హైదరాబాద్: నకిలీ 2000 మరియు 500 రూపాయల నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులలో 10 మందిని ఎల్ బి నగర్ జోన్ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ…నిందితుల వద్ద నుండి 31 లక్షల 25 వేల500 రూపాయల నకిలీ నోట్లను,ఒక కారు, ఒక ప్రింటర్, ఒక స్కానర్,ప్రింటింగ్ మెటీరియల్ మరియు 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నిందితులు ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, షాద్ నగర్, నల్గొండల్లో వారం, వారం జరిగే సంతలలో పశువులు కొనేప్పుడు నిజమైన నోట్లలో నకిలీ నోట్లు పెట్టి చెలామణి చేసేవారని సీపీ చెప్పారు. ప్రధాన నిందితుడు రాకేష్ గతంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఎడ్యుకేషన్ పత్రాల తయారీలో అరెస్ట్ అయ్యాడు. నిందితులు రెండు గ్రూప్ లుగా విడిపోయి ఒక గ్రూప్ 2000 రూపాయల నకిలీ నోట్లు, మరొక గ్రూప్ సభ్యులు 500 రూపాయల నకిలీ నోట్లు తయారు చేసేవారని ఆయన వివరించారు. నకిలీ నోట్లు తయారు చేసే సమయంలో నిందితులు ముందుగా నిజమైన నోట్లతో కొలతలు తీసుకుని కలర్ ప్రింటింగ్ చేసి కట్ చేసిన తరువాత మహాత్మా గాంధీ చిత్రం మరియు ఎలక్ట్రో టైప్ 2000 లేదా 500 ని స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్ తో ముద్రించేవారని మహేష్ భగవత్ చెప్పారు.