ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చాక్లెట్

ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అందరికీ తెలుసు కానీ ఎక్కువ మంది అవి పాటించటానికి ఇష్టపడరు. అదేమంటే హడావిడిలో వచ్చేసామనో…ఇంకేదో కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. వన్ వే అమలు అవుతున్న చోట కానిస్టేబుల్ లేకపోతే రాంగ్ రూట్ లో కూడా వెళ్తూ ఉంటారు. ఇక హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవటం అనేవి వాహనదారులు ధరించరు. క్రిస్మస్ పండుగ వేళ హాడావిడిలో పడి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి చాక్లెట్లు పంచి పెట్టి ట్రాఫిక్ రూల్స్ గురించి మరింత అవగాహాన పెంచారు గోవా ట్రాఫిక్ పోలీసులు.
గోవాలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్ధతితో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చేపట్టి వార్తల్లో నిలిచారు. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు సాంటాక్లాజ్‌లా వేషం ధరించి రోడ్లపైకి వచ్చారు. ట్రాపిక్ రూల్స్ అతిక్రమించిన వారి నోరు తీపి చేస్తూ ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలియజేశారు. జీవితం విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కష్టాలను కొనితెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు.
ఈ సమయంలో బైక్‌పై వెళ్తున్న కొంతమంది ఐఎస్‌ఐ గుర్తింపు లేని, నాసిరకం హెల్మెట్లను వాడతున్నట్లు గుర్తించారు. పెద్ద వాహనాలు నడుపుతున్నవారు సీటుబెల్టు పెట్టుకోకపోవడం గమనించారు. జాగ్రత్త వహించడం అత్యంత ముఖ్య విషయమని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని సుతిమెత్తంగా వారిని హెచ్చరించారు.
చాక్లెట్లు పంచుతూ వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్న ట్రాఫిక్ పోలీసులను అక్కడి జనాలు అభినందించారు. ఇలా అర్థం అయ్యేలా ఓపికగా చెప్తే అందరూ కచ్చితంగా రూల్స్ పాటిస్తారని ఓ వాహనదారుడు పేర్కొన్నాడు. అందరూ పండగ బిజీలో మునిగిపోతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం వారి విధుల్లో మునిగి తేలుతున్నారని ఓ మహిళ పేర్కొంది.