Health dept probes man’s death during cosmetic surgery
Cosmetic Surgery : జుట్టు ఊడిపోతుందని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్న ఓ 32ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మంగళూరులో జరిగింది. ఫ్లౌంట్ కాస్మెటిక్ సర్జరీ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ వికటించడంతో యువకుడి ప్రాణాల మీదుకుతెచ్చింది. ఈ ఘటనపై దక్షిణ కన్నడ జిల్లా ఆరోగ్య శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
జిల్లా కలెక్టర్ ముల్లై ముగిలన్ ఆదేశాల మేరకు డీకే జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ హెచ్‌ఆర్ తిమ్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ తిమ్మయ్య క్లినిక్‌ని సందర్శించారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఘటనపై ఆయన వివరాలను సేకరించారు.
Read Also : చైనాకు కొమ్ము కాస్తారా, భారత్‌తో సన్నిహితంగా ఉంటారా? శ్రీలంక కొత్త అధ్యక్షుడి భవిష్యత్ వ్యూహం ఏంటి..
వివరాల్లోకి వెళితే.. మృతుడు, ఉల్లాల్‌లోని అక్కరెకెరె నివాసి ముహమ్మద్ మజిన్.. గైనెకోమాస్టియా శస్త్రచికిత్స కోసం అతడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లో చేరాడు. వాస్తవానికి ఇది ఛాతీ వాపును తగ్గించే సాధారణ ప్రక్రియ. శస్త్రచికిత్స సాధారణంగా అరగంటలో పూర్తవుతుంది. అయితే, ప్రక్రియ ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువ సమయం పట్టింది. ఆరోజు సాయంత్రం వరకు కూడా డిశ్చార్జ్ కాకపోవడంతో మాజిన్ కుటుంబం ఆందోళన చెందింది.
దీనిపై మృతుడి కుటుంబం క్లినిక్ వైద్యులను ప్రశ్నించగా.. సర్జరీ సమయంలో అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని మరో ఆస్పత్రికి తరలించారు. అయితే, మాజిన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యమే మాజిన్ అకాల మరణానికి దారితీసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కద్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి సోమశేఖర్ తెలిపారు. “ఈ సంఘటన సెప్టెంబర్ 21న జరిగింది. అదే రోజు యువకుడి మరణ సహజం కాదని రిపోర్టు ఫైల్ చేశాం. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి వెన్‌లాక్ ఆస్పత్రి నుంచి పోర్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం”అన్నారాయన. క్లినిక్ యాజమాన్యం, శస్త్రచికిత్సకు బాధ్యులైన వైద్యులతో ఆరోగ్య శాఖ అధికారి తిమ్మయ్య సమావేశమయ్యారు.
వైద్యారోగ్య శాఖ ప్రాథమిక విచారణ జరుపుతోందని, సమగ్ర నివేదికను డిప్యూటీ కమిషనర్‌కు అందజేస్తామని ఆయన ధృవీకరించారు. శస్త్రచికిత్స, మజిన్ మరణానికి సంబంధించిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. అది అందిన తర్వాత దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తిమ్మయ్య చెప్పారు.
Read Also : బొత్స సత్యనారాయణకు తమ్ముడు బిగ్ షాక్..! జనసేనలో చేరేందుకు రెడీ?