ప్రణయ్‌ని హత్య చేయించి అప్పుడు మారుతీరావు, హేమంత్‌ను చంపించి ఇప్పుడు లక్ష్మారెడ్డి ఏం సాధించారు? ఈ పరువు హత్యలకు ముగింపు ఎప్పుడు..?

  • Publish Date - October 2, 2020 / 01:28 PM IST

honour killings: పరువు కోసం ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు..చివరకు సాధిస్తుందేంటి..? ప్రణయ్‌ను చంపించి అప్పుడు మారుతీరావు సాధించిందేంటి..? హేమంత్‌ను హత్య చేయించి ఇప్పుడు లక్ష్మారెడ్డి సాధించేదేంటి..? ప్రేమ విషయం తెలియగానే ముందుగా పేరెంట్స్‌ చేయాల్సిన పనేంటి..? అసలు ఈ పరువు హత్యలకు ముగింపు ఎప్పుడు..?

ప్రేమ పెళ్లిపై కులం కత్తివేటు.. అనాదిగా అదే రక్త చరిత్ర.. చంపేస్తే..ప్రేమ చచ్చిపోతుందా..? ప్రాణం తీస్తే పరుగు తిరిగొస్తుందా..? కులం, డబ్బు అంతకి మించి హోదా ఉంటే చాలా…? అప్పుడు అమృత..ఇప్పుడు అవంతి.. నాడు మారుతీరావు సాధించిందేంటి..? నేడు లక్ష్మారెడ్డి సాధించేదేంటి..? కులపిచ్చితో కూతురు ప్రేమపై కత్తి.. కూతుర్ని విధవను చేయడమే తండ్రి ప్రేమా..? పరువు హత్యలకు ముగింపు లేదా..?

మొన్న నరేశ్, నిన్న ప్రణయ్, నేడు హేమంత్.. కులోన్మాదుల చేతుల్లో ప్రాణాలు విడిచారు:
పరువు హత్యలు పడగ విప్పుతున్నాయి. కన్న తండ్రులే కాలయముళ్లవుతున్నారు. ఆర్థిక అసమానతలు, కులం కార్డులు హత్యలు చేసేస్తున్నాయి. మొన్న నరేశ్‌..నిన్న ప్రణయ్‌..తాజాగా హేమంత్‌..ఈ ముగ్గురు కులపిచ్చికి బలయ్యారు. కులాంతర వివాహం చేసుకున్న ఈ ముగ్గురు…కులోన్మాదుల చేతుల్లో ప్రాణాలు విడిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య తరహాలోనే హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన పరువు హత్య..మరోసారి రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అందరిని కలచి వేసింది. మరి నరేశ్‌, ప్రణయ్‌, హేమంత్‌ లాగా ఇంకెంత మంది యువకులు ఈ కుల దురహంకారానికి బలవ్వాలి..? పరువు హత్యలకు అసలు ముగింపు అనేదే లేదా..?

కూతురి జీవితాన్ని నాశనం చేసిన మారుతీరావు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు:
మారుతీరావుకు కూతురంటే ఎనలేని ప్రేమ. ఆ కూతురు మరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కులాంతర వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. కూతురికి ఏదో రకంగా నచ్చచెబితే..మనసు మార్చుకునేదేమో. తండ్రి చూపించే ప్రేమ ముందు..ఆ యువకుడి ప్రేమ తక్కువేనని అనుకునేదో..ఏమో..కానీ..మారుతీరావు అలా చేయలేదు. కూతురి ప్రేమ విషయం తెలియగానే..ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ యువకుడ్ని చంపేస్తే…కూతురు తన వద్దకు వస్తుందని అనుకున్నాడు. కానీ..చివరకు ఏం జరిగింది. అటు హత్య చేయించి కూతురి జీవితాన్ని
నాశనం చేశాడు. ఇటు తానూ ఆత్మహత్యకు పాల్పడి…తన కుటుంబాన్ని నడిరోడ్డున పడేశాడు.

తన పరువు తీసిన కూతురు…ఇక లేదని అనుకుని వదిలేసి ఉంటే:
మారుతీరావు ఘటన చూస్తే..చాలు, పగ ఎంతవరకు దారి తీస్తుందో అర్థమైపోతుంది. జీవితాలు నాశనం అవ్వడమే..తప్ప..సాధించిదేమి ఉండదని.. ఆ రోజు మారుతీరావు..తన పరువు తీసిన కూతురు…ఇక లేదని అనుకుని వదిలేస్తే..ఇవాళ ఇందరి జీవితాలు నాశనం అయ్యేవి కావేమో. కొద్ది రోజులు ఇటు కూతురు..అటు తల్లిదండ్రులు బాధపడేవాళ్లు. ఆ తర్వాత ప్రేమించిన
వాడితో ఆ కూతురు హ్యాపీగా ఉండేది. ఇటు మారుతీరావు కుటుంబం సంతోషంగా ఉండేది. ఇదే జరిగుంటే…ప్రస్తుతం గొడవలన్నీ మార్చిపోయి అందరూ కలిసిమెలిసి ఉండేవారేమో.

దీవించాల్సిన తండ్రే కూతురిని విధవను చేశాడు:
ఇక లక్ష్మారెడ్డి…కాళ్ల పారాణి ఆరకముందే కూతురి నుదుటన బొట్టును చేరిపేశాడు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలంటూ దీవించాల్సింది పోయి కూతుర్ని విధవను చేశాడు. హ్యాపీగా సాగిపోతున్న పచ్చటి సంసారంలో నిప్పులు పోశాడు. కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. అప్పుడు..ఇప్పుడు..పాత్రలు మారాయి..ప్రాంతాలు మారాయి..వ్యక్తులు మారారు. కానీ..జరిగిన కథ మాత్రం ఒక్కటే. అక్కడ మారుతీరావుకు..ఇక్కడ లక్ష్మారెడ్డికి కులం పిచ్చి పట్టింది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.

కులం ముసుగులో సాధించిందేంటి:
మరి కులం ముసుగులో మారుతీరావు సాధించిందేంటి..? కూతుర్ని హత్య చేయించి..అతడు ఆత్మహత్య చేసుకుని సమాజానికి ఏం మెసేజ్‌ ఇచ్చాడు..? సేమ్‌ టు సేమ్‌…పరువు పేరుతో మారుతీరావు లాగే వ్యహారించిన లక్ష్మారెడ్డి..ఏం సాధించాడు..? మున్ముందు ఏం సాధించబోతున్నాడు..? అంటే సమాధానం లేదు.

కులాంతర వివాహం చేసుకుంటే భవిష్యత్‌లో జరగబోయే పరిణామాల గురించి చెప్పాలి:
ప్రేమ వివాహం నచ్చని తల్లిదండ్రులు…ముందుగా ఆగ్రహానికి గురికాకుండా…కూతుళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రేమ వివాహం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో వివరించాలి. కులాంతర వివాహం చేసుకుంటే భవిష్యత్‌లో జరగబోయే పరిణామాల గురించి చెప్పాలి. నచ్చజెప్పాలి. ఇలా చేస్తే…వాళ్లు మారే అవకాశం లేకపోలేదు. కానీ అలా కాకుండా…కూతురి ప్రేమ విషయం తెలియగానే ఆవేశానికి లోనైతే..అటు వాళ్లు కూడా అంతకంటే ఎక్కువ ఆవేశానికి లోనవుతారు. ఆ ఆవేశంలో అటు పిల్లలు…ఇటు తండ్రులు..తీసుకునే నిర్ణయాలు చివరకు జీవితాలను నాశనం చేస్తాయనడానికి…ప్రస్తుత ఘటనలే నిదర్శనం.

ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. కూతురి ప్రేమ విషయం తెలియగానే ఆవేశానికి లోనవ్వకుండా…వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. వినకపోతే వదిలేసేయండి. వాళ్ల బతుకు వాళ్లు బతికేస్తారు. లేదు..మాకు పరువు, ప్రతిష్టతలే ముఖ్యమని అనుకుంటే…ఇదిగో మీకు ఇలాంటి ఘటనే ఎదురవ్వొచ్చు. ఇకనైన ఆలోచించి నిర్ణయాలు తీసుకుని…ఆనందంగా ఉండండి, ఉండనివ్వండి.