Hyderabad: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ.. బార్డర్‌ దాటేలోపు పట్టేశారు.. ఎలాగో వివరించిన సీవీ ఆనంద్

నిందితులు నేపాల్‌ సరిహద్దు దాటితే పట్టుకోలేమని భావించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు.. కూకట్‌పల్లి నుంచి బస్‌లో పూనే వెళ్లినట్టు గుర్తించారు.

Hyderabad cops caught Nepali gang

Hyderabad Cops: ప్రస్తుతం హైదరాబాద్‌లో నేపాల్‌ గ్యాంగ్‌ (nepali gang)ల దోపిడీలు ఎక్కువగా అవుతున్నాయి. ఇటీవలే రాయదుర్గం (Rayadurgam)లోని ఓ ఇంట్లో పనిచేసే వాచ్‌మెన్‌… భోజనంలో మత్తు మందు కలిపి తాపీగా దోచేసుకున్నారు. మత్తునుంచి తేరుకున్న ఇంట్లోనివారు డయల్‌ హండ్రెడ్‌ (Dial 100)కు కాల్‌ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే నిందితులను నేపాల్‌ ఎంటర్ అయ్యేలోపే పట్టుకున్నారు. అలాగే కూకట్‌పల్లి (Kukatpally) వివేకానందనగర్‌లోనూ నేపాల్‌ వాచ్‌మెన్‌ అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు. తన బంధువులతో కలిసి నేరుగా డబ్బులు ఉన్న ప్లేస్‌కు వెళ్లిన ఆ వాచ్‌మెన్‌ చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు నిందితుల ఆట కట్టించారు.

తాజాగా రామ్‌గోపాల్‌పేట్‌ (Ramgopalpet) లో కూడా మరో చోరీ జరిగింది. ఆరేళ్లుగా సింధీ కాలనీ (Sindhi Colony) లోని వ్యాపారి రాహుల్‌ గోయల్‌ ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శంకర్‌ మాన్‌ సింగ్‌ అలియాస్‌ కమల్‌.. ఆ కుటుంబానికి నమ్మకస్తుడిగా మారిపోయాడు. రాహుల్‌ గోయల్‌ తన ఫ్యామిలీతో శివార్లలోని ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. రెండు రోజులుగా ఫ్యామిలీ మెంబర్స్‌తో.. ఫార్మ్‌ హౌజ్‌ డిస్కషన్‌ చేస్తుండటం వాచ్‌మెన్‌ కమల్‌ గమనించాడు. అంటే.. ఫ్యామిలీ మొత్తం రెండు రోజులు ఇల్లు వదిలిపెట్టిపోతున్నారని పసిగట్టేసాడు.

ఇంకేముందీ.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న టైమ్‌ రానే వచ్చింది.. పూనేలో ఉన్న తన బంధువులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. మొత్తం పదమూడు మంది హైదరాబాద్‌లోని కమల్‌ ఉంటున్న ప్లేస్‌కు వచ్చారు. అంతా పార్టీ చేసుకున్నారు. రాహుల్ గోయల్‌ ఇంట్లోని 8 బెడ్‌రూముల్లో ఉన్న నగలు, నగదుతో పాటు విదేశీ కరెన్సీని మొత్తం దాదాపు ఐదు కోట్ల విలువైన సొమ్మును బ్యాగుల్లో నింపుకుని అంతా.. వాచ్‌మెన్‌ కమల్‌ రూమ్‌లోకి వచ్చారు. అక్కడే ఎవరి వాటా వారు పంచుకుని.. మూడు టీమ్స్‌గా విడిపోయారు. ఒక టీమ్‌ పూనే, మరో టీమ్‌ బెంగళూరు, ఇంకో టీమ్‌ ముంబైకి పారిపోయారు. పోలీసులను దాదాపు పదిరోజుల పాటు ఉరుకులు పరుగులు పెట్టించింది ఈ నేపాలీ గ్యాంగ్‌.

Hyderabad Cops Recovers Theft Money

నిందితులు నేపాల్‌ సరిహద్దు దాటితే పట్టుకోలేమని భావించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు.. కూకట్‌పల్లి నుంచి బస్‌లో పూనే వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే ఓ టీమ్‌ పూనే, మరో టీమ్‌ ముంబై, బెంగళూరుకు చేరుకున్నారు. పోలీసులు పూనేకు వెళ్లే లోపు నిందితులు అక్కడ ఇంటిని ఖాళీ చేసి వెల్లిపోయారు. చుట్టుపక్కల వారు చెప్పిన సమాచారంతో ఖచ్చితంగా నేపాల్‌కు పారిపోతారని భావించారు. ఒక ఇన్నోవా వెహికిల్‌లో నిందితులు ఉన్నారన్న సమాచారంతో హైదరాబాద్ నుంచి ఓ ఎస్సైని ప్రత్యేకంగా నేపాల్‌ బార్డర్‌కు పంపించారు.

CV Anand Rewarded Ramgopalpet Cops

బార్డర్‌లో ఉన్న సహస్ర సీమా భల్‌ సిబ్బందికి నిందితుల ఫోటోలు చూపెట్టి.. చోరీ విషయాన్ని చెప్పారు. రాచకొండ సీపీ చౌహాన్‌కు అక్కడి అధికారులతో మంచి సంబంధాలు ఉండటంతో.. ఆయన కూడా ఎస్‌ఎస్‌బీ అధికారులతో మాట్లాడారు. నిందితులను నేపాల్‌ బార్డర్‌ దాటించేందుకు దీపక్‌ అనే ఓ వ్యక్తి నేపాల్‌ సరిహద్దులకు వచ్చాడు. కాని అక్కడ పోలీస్‌ మూమెంట్‌ చూసి.. అతను మల్లీ నేపాల్‌లోకి వెళ్లిపోయాడు. చివరకు ఏ-1 నిందితుడు కమల్‌తో పాటు అతని భార్యా, మరో నిందితుడు ముగ్గురూ డబ్బు, నగలతో నేపాల్‌ బార్డర్‌ దాటేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడి ఎస్‌ఎస్‌బీ సిబ్బందిని అలర్ట్‌ చేయడంతో వారు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. మిగతా వారిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. మొట్ట మొదటిసారిగా నేపాలీ గ్యాంగ్ నుంచి సొమ్ము రికవరీ చేసినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

CV Anand meeting with Nepali association members

మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న.. నేపాలీ అసోసియేషన్ సభ్యులు అందరినీ పిలిపించిన సీపీ సీవీ ఆనంద్‌.. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కొంతమంది వాచ్‌మెన్‌లు చేస్తున్న దొంగతనాలతో నేపాల్‌ మొత్తానికి చెడ్డపేరు వస్తోందని నేపాలీ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: భాగ్యనగరంలో చుక్కలు చూపిస్తున్న క్యాబ్ ధరలు.. వర్షాల్ని క్యాష్ చేసుకుంటున్న యజమానులు