Gold And Cash Missing: వామ్మో.. 2కోట్ల విలువైన బంగారం, 80లక్షల క్యాష్‌తో బ్యాంకు ఉద్యోగి జంప్.. లక్కీ భాస్కర్ సినిమా స్టైల్‌లో భారీ మోసం..

ఈ భారీ మోసం స్థానికంగా సంచలనం రేపింది. విషయం తెలిసి కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Gold And Cash Missing: లక్కీ భాస్కర్ సినిమా గుర్తుంది కదూ. అందులో జరిగే మోసం తెలుసు కదా. సరిగ్గా అదే స్టైల్ లో బ్యాంకు మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్-2 లో భారీ గోల్ మాల్ జరిగింది.

బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. లాకర్ నుండి రూ.80 లక్షల నగదు, సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారంతో క్యాషియర్ నరిగె రవీందర్ ఉడాయించాడు.

గత నెల నుంచి లాకర్ తాళాలు తన వద్దే పెట్టుకున్నాడు బ్యాంక్ క్యాషియర్ రవీందర్. విషయం తెలిసి బ్యాంకు ఉన్నతాధికారులు షాక్ కి గురయ్యారు. బ్యాంకును లోపల నుండి మూసివేసి పోలీసుల సమక్షంలో విచారణ జరుపుతున్నారు అధికారులు.

ఇతర సిబ్బంది చేతివాటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గత రెండు రోజులుగా ఆడిట్ నిర్వహిస్తున్నారు బ్యాంకు అధికారులు. ఆడిట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు గుర్తించారు. బ్యాంకులోని బంగారం, డిపాజిట్లు, నగదులో లోపాలను కనుగొన్నారు.

సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుసుకున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ భారీ మోసం స్థానికంగా సంచలనం రేపింది. విషయం తెలిసి కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ సొమ్ము గురించి ఖాతాదారులు కంగారు పడుతున్నారు.

ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడైన క్యాషియర్ కనిపించకుండాపోవడంతో అతడి పాత్రపై అనుమానాలు పెరిగాయి. పరారీలో ఉన్న క్యాషియర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: బీకేర్ ఫుల్.. ఒక్క వాట్సాప్ కాల్‌తో.. 7లక్షలు కొట్టేశారు.. 81ఏళ్ల వృద్ధుడిని ఇలా మోసం చేశారు..