క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు చూస్తుండగానే..టీచర్ ను కత్తితో పొడిచి భర్త హత్యాయత్నం

క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు చూస్తుండగానే..టీచర్ ను కత్తితో పొడిచి భర్త హత్యాయత్నం

Updated On : February 27, 2021 / 1:03 PM IST

Husband attempts murder on teacher : ప్రభుత్వ ఉపాధ్యాయురాలపై ఆమె భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇరగవరం మండలం కాకిలేరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపురంకు చెందిన గుత్తుల నాగలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్‌ తో నాగలక్ష్మీకి 2016లో వివాహం అయింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు.

గత నెల 16న కాకిలేరు శివారు సింగోడియన్‌ పేటలోని ఎంపీపీ పాఠశాలకు నాగలక్ష్మిని బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు వద్దకు వచ్చి నాగలక్ష్మి టీచర్‌ను కలవాలని అడిగాడు. క్లాస్‌రూమ్‌లో ఉందని చెప్పడంతో వెళ్లి విద్యార్థులు చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని నేల్‌ కట్టర్‌లోని చాకుతో వీపుపై, పక్కటెముకలపై దాడి చేశాడు.

విద్యార్థులు గట్టిగా అరవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్కడకు చేరుకుని వెంటనే ఎంఈఓ ఎస్‌.శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రామ దుర్గాప్రసాద్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఇదివరకే వరకట్నం వేధింపుల కేసు ఉందని ఎస్సై జానా సతీష్‌ తెలిపారు. ప్రస్తుత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.