భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా..సీన్ లోకి మొదటి వైఫ్ వచ్చింది. అంతే..సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పెళ్లి మండపంలో వేద మంత్రాలు వినిపించాల్సిన చోట..అరుపులు, కేకలతో దద్ధరిల్లింది. ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన వేలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
వేలూరు సమీపంలోని మేట్టు ఇడయాంబట్టి గ్రామంలోని MGR నగర్ లో రామచంద్రన్ (45) నివాసం ఉంటున్నాడు. ఇతనికి కమలితో వివాహం జరిగింది. వీరికిద్దరు పిల్లలు. తొర్రపాడిలో టైలర్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం అయి..19 సంవత్సరాల తర్వాత భార్య భర్తల మధ్య విబేధాలు పొడచూపాయి. ఐదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నాయి. అయితే..కరూర్ కు చెందిన ఓ యువతి..తొర్రపాడిలోని బంధువుల ఇంటికి వచ్చింది. అక్కడే రామచంద్రన్ కూడా ఉన్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఆమెను ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. 2020, జూన్ 03వ తేదీ బుధవారం అడుక్కంబరైర్ లోని అమ్మన్ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం పూజలు చేసుకున్నారు. ఈ విషయం కమలికి తెలియదని అనుకున్నాడు. కానీ తాళి కడుతున్న సమయంలో కమలి, ఇద్దరు కుమారులను తీసుకుని ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి దుస్తుల్లో మిలామిలా మెరిసిపోతున్న రామచంద్రన్ ను నిలదీసింది.
ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. పెళ్లి కుమార్తె బంధువులు, కమలి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఒక విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అమ్మన్ ఆలయం వద్దకు చేరుకున్నారు. వివాహాన్ని నిలిపివేశారు. కరెక్టుగా ఈ సమయంలోనే రామచంద్రన్ కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన గురించి దర్యాప్తు చేపడుతున్నారు.
Read: పెళ్లి పేరుతో మహిళ ఘరానా మోసం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రూ.కోటి కాజేసింది