Jubilee Hills Hit And Run Case
Jubilee Hills Hit And Run Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారును పోలీసులు గుర్తించారు. నిందితుడిని కూకట్ పల్లికి చెందిన ద్వారపూడి నాగగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు కారుతో బైక్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోగా.. బౌన్సర్ తారక్ రామ్ స్పాట్ లోనే చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి కూకట్ పల్లిలో నిందితుడిని సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతివేగంగా కారుని డ్రైవ్ చేసిన నిందితుడు.. ముందు వెళ్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న తారక్ రామ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీవీటీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేపట్టారు.
తెల్లవారుజామున ప్రమాదం జరిగితే.. సాయంత్రం వరకు పోలీసులు నిందితుడిని గుర్తించలేదు అంటూ మృతుడి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో బైఠాయించి ఆందోళనకు దిగారు. మాదాపూర్ నుంచి పంజాగుట్ట వరకు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా చివరికి కారుని గుర్తించారు. నిందితుడు నాగ నిర్లక్ష్యంగా, వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన తారక్ పబ్ లో బౌన్సర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా బైక్ ను బలంగా ఢీకొట్టిన కారు డ్రైవర్.. కారుని ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు.
Also Read : రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్ వ్యాపారి నుంచి 98లక్షలు కాజేశారు.. ఎలాగో తెలిస్తే షాకే