Morphed Photos
Morphed Photos : సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక తీర్చాలని వేధిస్తాడు. లేదంటే ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. ఇలా పలువురు మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి వాడి పాపం పండి పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్ సంజీవరెడ్డినగర్‌కు చెందిన మహిళకు ఆదివారం రాత్రి ఇన్‌స్టాలో గుర్తుతెలియని ఓ ఖాతా నుంచి మేసేజ్ వచ్చింది. క్రేజీ ఛాట్ చేయాలని అందులో ఉంది. ఆమె తిరస్కరించి వెంటనే ఆ అకౌంట్ ను బ్లాక్ చేసింది. మరో ఖాతా నుంచి ఆమెకు సంబంధించిన మార్ఫింగ్ చిత్రాలతో పాటు ఓ సినీ నటి చిత్రాన్ని పంపాడు. నీ కూతురి చిత్రాన్ని ఈ నటి చిత్రానికి ఎడిట్ చేసి పంపించాలనుందన్నాడు. దీంతో ఆమె ఆ ఖాతానూ బ్లాక్ చేసింది. మరో ఖాతా నుంచి ఆమె కుమార్తె చిత్రాన్ని మార్ఫింగ్ చేసి పంపాడు. నన్ను తిరస్కరిస్తే మీ అమ్మాయి చిత్రాలను వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, గుండూరుకు చెందిన మొగిలి ఆంజనేయులు(21) హైదరాబాద్ కొత్తపేటలో నివాసముంటున్నాడు. డిగ్రీ మధ్యలో మానేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆంజనేయులు love_call_me_anji పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. మహిళల ఖాతాలను ఫాలో చేస్తాడని, ఛాటింగ్‌లు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా అతన్ని బ్లాక్ చేస్తే.. రకరకాల పేర్లతో నకిలీ అకౌంట్లు తెరుస్తాడని, బ్లాక్ చేసిన ఖాతాలోని డీపీ చిత్రాలను తీసుకొని నూడ్ చిత్రాలకు బాధితుల ముఖాలను తగిలిస్తాడని వివరించారు. నకిలీ అకౌంట్ల ద్వారా వాటిని బాధితులకే పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు.
మార్ఫింగ్ చేసిన ఫొటోలతో నగ్నంగా కనిపించాలని వేధిస్తాడు. లేదంటే మీ నూడ్ చిత్రాలను ఇతరులకు పంపిస్తానని, వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. కొందరు అతడి బెదిరింపులకు లొంగిపోయి అంగీకరించారు. అంతేకాదు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. అలా 15మంది చిత్రాలను మార్ఫింగ్ చేశాడని పోలీసులు చెప్పారు. ఎందుకిలా చేశావ్ అంటే.. సరదా కోసం అని అతడు చెప్పడం అందరిని షాక్ కి గురి చేసింది. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు కేర్ ఫుల్ గా ఉండాలంటున్నారు. వ్యక్తిగత విషయాలు, వివరాలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టకపోవడమే మంచిదని అంటున్నారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు ప్రమాదానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.