లండన్: భారతీయులకు బంగారం అంటే విపరీతమైన మోజు. ఎంత అంటే….. అప్పు చేసైనా సరే బంగారం కొంటారు. పండుగలకు పబ్బాలకు గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ప్రజల్లో నాటుకు పోయి ఉంది. వారు ఎక్కడున్నా ఆ అలావాటు మారదు. అదే ఇప్పుడు బ్రిటన్ లో బంగారం దొంగలకు అనువుగా మారింది. ఇక్కడి బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం బీబీసీ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కోంది.
గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరికి గురైందనీ, అందులో అత్యధిక భాగం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్ లండన్‌లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది.
ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు చెపుతున్నారు. చెషైర్ పోలీస్ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్ దుగ్గన్ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్ హ్యాండ్ నగలు కొనే వ్యాపారులు… అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోకుండా కొంటూ ఉంటారని ఆరోపించారు. ఈ దేశంలో బంగారం చిన్న,చిన్న, ముక్కలుగా అమ్మడం కన్నా సెకండ్ హ్యాండ్ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు.
దీపావళి, దసరా వంటి భారతీయ ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్ పోలీసులు చెపుతున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్‌లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది.
పశ్చిమ లండన్‌లోని సౌథాల్‌లో ఆసియా స్టైల్ బంగారం నగలు అమ్మే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బంగారం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తన దగ్గర బంగారం కొనే ప్రతి వారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్ కుమార్ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్ పోలీసు విభాగంలో డిటెక్టివ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ నగ్గెట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు.