Child Trafficking: దత్తత పేరుతో దారుణం.. సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. ఒక్కో బిడ్డ 10లక్షలకు అమ్మకం..

మూడేళ్లుగా శిశు విక్రయాలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది పిల్లలను అక్రమంగా రవాణ చేసినట్లు గుర్తించారు.

Child Trafficking: మనుషుల్లో మానవత్వం లేకుండా పోతోంది. ఏ మాత్రం జాలి దయ అనేవి కనిపించడం లేదు. కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. కొందరు వ్యక్తులు దత్తత పేరుతో దారుణానికి ఒడిగట్టారు. దత్తత తీసుకున్న శిశువులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేటలో ఈ దారుణం వెలుగుచూసింది.

శిశు విక్రయాల వ్యవహారం సూర్యాపేటలో కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కేంద్రంగా అక్రమంగా శిశువులను దత్తత తీసుకొని విక్రయిస్తున్న అంతరాష్ట్ర గ్యాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 మంది చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ గ్యాంగ్ అరచకాలు తెలుసుకుపి పోలీసులే విస్తుపోయారు.

మూడేళ్లుగా శిశు విక్రయాలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి శిశువులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి తెలంగాణకు తీసుకొస్తారు. ఇక్కడ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు శిశువులను విక్రయిస్తున్నారు.

సూర్యాపేట విద్యానగర్‌కు చెందిన నక్క యాదగిరి (ఏ1), ఉమారాణి (ఏ2) దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తారు. సంతానం లేని తల్లిదండ్రుల వివరాలను సేకరిస్తారు. వీరు శిశు విక్రయ ముఠా నుంచి అక్రమంగా దత్తత తీసుకొని శిశువులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మొత్తం 28 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 మంది చిన్నారులను అమ్మేశారు. వీరిలో ఏడుగురు మగ, ముగ్గురు ఆడ శిశువులు ఉన్నారు. విక్రయించిన శిశువులను గుర్తించి వారిని శిశు విహార్ కు తరలించారు పోలీసులు. ఆ చిన్నారులంతా మూడేళ్లలోపు వారే.

ఇలా.. గ్యాంగ్ గుట్టు రట్టు..
శిశువును దత్తత తీసుకున్న టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్యను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ముఠా గుట్టు రట్టైంది. వీరిచ్చిన సమాచారంతో సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారులు నక్క యాదగిరి, ఉమారాణి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మరో శిశువు అక్రమ రవాణా విషయమై చర్చించేందుకు సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో గ్యాంగ్ సభ్యులు ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. వెంటనే హైటెక్ బస్టాండ్ కు చేరుకున్న పోలీసులు.. మిగిలిన గ్యాంగ్ సభ్యులు అందరినీ అరెస్ట్ చేశారు.

Also Read: అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఒకేసారి రెండు షాకులు ఇచ్చిన ట్రంప్

ఇది ఇలా ఉంటే.. శిశువులను కొనుగోలు చేసి పెంచుకుంటున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాము కంటికి రెప్పలా చూసుకుంటూ, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను తమ నుంచి దూరం చేయొద్దంటూ పెంపుడు తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. తాము పెంచుకుంటున్న పిల్లలను పోలీసులు శిశు విహార్ కు తరలించడంతో పెంపుడు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను తమ నుంచి దూరం చేయొద్దు అంటూ వేడుకున్నారు.

సూర్యాపేట జిల్లాలో శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అమాయక గర్భిణిలే టార్గెట్ గా వారిని ట్రాప్ చేసి మరీ శిశువుగా పుట్టగానే విక్రయిస్తోంది ఈ ముఠా. ఆ గ్యాంగ్ విక్రయించిన శిశువులను పోలీసులు శిశు విహార్ కు తరలించారు. శిశు విక్రయాల కేసులో పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. నిందితులకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.