Jagtial Incident : ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం.. కూతురికి శిరోముండనం చేసిన తల్లిదండ్రులు
మరో కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని.. అమ్మాయి తల్లిదండ్రులు దారుణంగా వ్యవహరించారు. కన్నకూతురు అని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి మరీ గుండు కొట్టించారు. తీవ్రంగా కొట్టారు.

Jagtial Incident : సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతులు తొక్కుతోంది. ఇవి 5జీ రోజులు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కొందరు మనుషుల్లో మార్పు రావడం లేదు. కులాలు, మతాల పేరుతో ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు. పరువు, ప్రతిష్ట పేరుతో కన్నవారిని సైతం కడతేరుస్తున్నారు. మూఢ నమ్మకాలతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
మరో కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని.. అమ్మాయి తల్లిదండ్రులు దారుణంగా వ్యవహరించారు. కన్నకూతురు అని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి మరీ గుండు కొట్టించారు. తీవ్రంగా కొట్టారు. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. జగిత్యాల జిల్లా ఇటిక్యాలలో ఈ దారుణం జరిగింది.
శిరోముండనం చేయిస్తే అమ్మాయి ఆ అబ్బాయిని మర్చిపోతుందని ఓ మాంత్రికుడు చెప్పాడట. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కన్న వాళ్లు ఎన్ని హింసలు పెట్టినా కట్టుకున్న వాడే కావాలంటూ ఆ యువతి పోలీస్ స్టేషన్ కు చేరింది. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు (23).. రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత (20) ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమకు నిరాకరించారు. అయినా వారు వినలేదు. రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తగారింట్లో ఉంది. ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడి చేసి యువతిని అపహరించుకుపోయారు. కారులో బలవంతంగా తీసుకు వెళుతూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు.
ఆమె కేకలు వేస్తున్నా వదలలేదు. కన్న కూతురు అన్న కనికరం చూపించలేదు. తమ పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా భావించారు. అంతేకాదు అమ్మయికి శిరోముండనం కూడా చేశారు. ఆ తర్వాత రాత్రంతా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు.
దీంతో సోమవారం ఉదయం ఆమె జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. తనకు జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు.