జయరాంని చంపింది తానేనని అంగీకరించిన రాకేశ్

  • Publish Date - February 4, 2019 / 07:02 AM IST

పారిశ్రామిక వేత్త జయరామ్‌ హత్యకేసు విచారణలో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి.  జయరామ్‌ను తానే చంపానని నిందితుడు రాకేశ్‌రెడ్డి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించనందుకే హత్య చేశానని పోలీసుల విచారణలో రాకేశ్ ఒప్పుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం పోలీసులతో రాకేశ్ ఏం చెప్పాడంటే…

‘‘మెదక్‌లో జయరాంకు టెట్రాన్ పాలీలెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉద్యోగులకు జీతం అందక గొడవ చేస్తున్నరని  వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు జయరాం నా దగ్గర రూ. 4.5 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలోనే జయరాం మేనకోడలు శిఖాచౌదరి నాకు పరిచయం అయింది. ఆ తర్వాత మా మధ్య బంధం బలపడడంతో శిఖా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె కోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టా. అయితే శిఖా చౌదరిని వదిలేయాలని జయరాం చెప్పాడు. నాకు ఇవ్వాల్సిన 4.5 కోట్లతో పాటు శిఖాకి ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానని చెప్పాను. అందుకు ఓకే అన్న జయరామ్ ఇప్పటి వరకూ పైసా కూడా ఇవ్వలేదు.

జనవరి 29న జయరాం అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసి డబ్బులు అడగడానికి వెళ్లా. ఎంత అడిగినా జయరాం డబ్బులు ఇవ్వకపోయే సరికి అతడిని కిడ్నాప్ చేసి హోటల్‌కు తీసుకెళ్లా. 31వ తేదీ రాత్రి మా మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. జయరాంపై మూడు పిడిగుద్దులు గుద్దా. జయరామ్ హార్ట్ పేషెంట్ కావడంతో చిన్నపాటి దెబ్బలకే చనిపోయాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నందిగామ సమీపంలో వదిలేశా. అక్కడి నుంచి నేను బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేశా.’’ అని పోలీసుల విచారణలో రాకేశ్ చెప్పానట్లు తెలిసింది.