ఐదుగురు ఉగ్రవాద అనుమానితులు అరెస్టు

  • Publish Date - November 16, 2019 / 03:13 PM IST

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్  ప్రాంతంలో  లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసారు. స్థానికులను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, పీర్జాదా మొహమ్మద్ జాహిర్‌ అనే ముగ్గురిని సోపోర్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి  లష్కరే తొయిబా హెచ్చరికల పోస్టర్లతో పాటు, వారి వద్ద  అనుమానించదగిన పలు వస్తువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.
 
కుప్వారా బైపాస్ క్రాసింగ్ వద్ద  ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఉగ్రవాదులకు సహకరిస్తున్న  మరో ఇద్దర్ని కూడా అరెస్టు చేసినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. ఉల్ఫత్ బషీర్ మీర్, ఇజాజ్ అహ్మద్ భట్ అనే ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.  వీరిద్దరు నౌపోరా జాగీర్కు  చెందినవారుగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వీరిరువురికీ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధాలున్నాయని, వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు  తెలిపారు.