Jobs Fraud In Nizamabad District : గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అంటూ ప్రకటనలు.. కట్ చేస్తే రూ.2 కోట్లతో ట్రావెల్ ఏజెంట్ పరార్

గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో కొలువుల పేరుతో ఆశ చూపాడు. అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేసేందుకు ఫుడ్ ప్యాకింగ్ అని నమ్మించాడు. కడుపులో నీళ్లు కదలకుండా వైట్ కాలర్ ఉద్యోగం అంటూ మాటలతో మభ్యపెట్టాడు.

Jobs Fraud In Nizamabad District : గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో కొలువుల పేరుతో ఆశ చూపాడు. అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేసేందుకు ఫుడ్ ప్యాకింగ్ అని నమ్మించాడు. కడుపులో నీళ్లు కదలకుండా వైట్ కాలర్ ఉద్యోగం అంటూ మాటలతో మభ్యపెట్టాడు. భారీ జీతం వస్తుందని భ్రమలు కల్పించాడు. నమ్మి వచ్చిన వారి నుంచి మెడికల్ టెస్టులు, వీసా ప్రాసెసింగ్ ఫీజులు అంటూ డబ్బు గుంజాడు. అలా ఏకంగా రూ.2కోట్లు దండుకుని. తర్వాత బోర్డు తిప్పేశాడు ఓ ట్రావెల్ ఏజెంట్. ఈ ఘరానా మోసం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో వెలుగుచూసింది.

అతడి పేరు షేక్ బషీర్. డిచ్ పల్లిలో ఆర్కే టూర్స్ అండ్ ట్రావెల్స్ ను ఏర్పాటు చేసిన బషీర్.. నిరుద్యోగులను విదేశాలకు పంపిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి వేల రూపాయలు వసూలు చేశాడు. ఇలా 600 మంది నుంచి సొమ్ము దండుకున్నాడు.

Also Read..Chit Fund Fraud : ఏం తెలివి..! సంక్రాంతికి పప్పుల పేరుతో విజయనగరంలో ఘరానా మోసం.. లక్షల రూపాయలతో చిట్టీల వ్యాపారి పరార్

మాయ మాటలు చెప్పి మెడికల్ టెస్టులు పూర్తి చేశాడు. ఇవాళ కువైట్ పంపిస్తానని నమ్మబలికాడు. వీసా వచ్చేస్తోందని చెప్పాడు. డబ్బులు చెల్లించిన వారంతా విమానం ఎక్కేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కాగా, ఎందుకైనా మంచిదని ఓసారి ట్రావెల్స్ కు ఫోన్ చేశారు. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో వారంతా కంగుతిన్నారు.

ఏదో తేడా జరిగిందని వారికి అనుమానం వచ్చింది. డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు ఆర్కే ట్రావెల్స్ కి చేరుకున్నారు. అయితే, ఆఫీస్ మూసేసి ట్రావెల్ ఏజెంట్ షేక్ బషీర్ పరార్ అయ్యాడని తెలుసుకుని షాక్ తిన్నారు. తాము అడ్డంగా మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.

Also Read..Sullurupeta Chits Scam : సూళ్లూరుపేటలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్

డిచ్ పల్లిలో ధర్నాకు దిగారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. ట్రావెల్స్ ఏజెన్సీ కార్యాలయంలో పని చేసే రామ్ పూర్ గ్రామానికి చెందిన లింబాద్రిని పట్టుకుని బాధితులు నిలదీశారు. ఏజెంట్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వారున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.