మిస్టరీ వీడింది : జ్యోతిని చంపింది ప్రియుడే!

  • Publish Date - February 16, 2019 / 02:01 AM IST

ఎన్నో మలుపులు తిరిగిన జ్యోతి హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కివచ్చింది. పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో పక్కా ప్లాన్‌తో హత్య చేశాడని నిర్ధారణయింది. దుండగుల దాడిలో జ్యోతి చనిపోయిందని నమ్మించేందుకే శ్రీనివాసరావు తలపై గాయం చేసుకున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు స్వయంగా విచారించడంతో కేసు మిస్టరీ వీడింది. జ్యోతి హత్య విషయంలో శ్రీనివాసరావుకు మరో ఇద్దరు స్నేహితులు సహకరించినట్టు సమాచారం. ఆ ఇద్దరి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. 

జ్యోతిని హత్య చేసిన శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. పక్కా ప్లాన్‌తోనే తన చెల్లిని శ్రీనివాసరావు హత్య చేశాడని జ్యోతి అన్నయ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి హంతకులకు ఉరిశిక్ష వేయాలని కోరారు. ఈ కేసులో తమవెంట ఉండి మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు తానే హత్య చేశానని ఒప్పుకున్నాడని జ్యోతి తండ్రి తెలిపారు. కలెక్టర్‌ కూడా అతనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామన్నారని చెప్పారు.

ఇటు శ్రీనివాసరావు తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని చెబుతున్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటకురావాలంటే పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయాలని కోరారు. మరోవైపు జ్యోతి కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని శ్రీనివాసరావు తల్లి ఆరోపిస్తోంది. తమ కుమారుడికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మొత్తానికి ఈ కేసులో అసలు హంతకుడు శ్రీనివాసరావేనని తేలినట్లు జ్యోతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అతను కూడా ఒప్పుకున్నాడంటున్నారు. ఐతే.. ఈ విషయంపై పోలీసులు కూడా క్లారిటీ ఇస్తే.. ఈ కేసు మిస్టరీ పూర్తిగా వీడిపోతుంది.