మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ ఓ కొలిక్కివచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియుడు శ్రీనివాసరావు జ్యోతి హత్యకి పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కల్సి మర్డర్‌కు వారం రోజుల ముందు ఘటనా స్ధలంలో రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
పెళ్లి చేసుకోమని జ్యోతి వత్తిడి చేయటంతోనే..ప్రియుడు శ్రీనివాస్.. జ్యోతిని హత్య చేసేందుకు పథకం రచించాడు. ముందు అనుకున్న విధంగా జ్యోతిని ఘటనా స్ధలం వద్దకు తీసుకొచ్చిన శ్రీనివాస్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. ఇనుప రాడ్‌తో పవన్ ఆమె తలపై కొట్టి హత్య చేశాడు. నేరం తన మీదకు రాకుండా, ఎవరికీ అనుమానం కలుగకుండా ఉండేందుకు శ్రీనివాస్ కూడా ఇనుపరాడ్‌తో తన తలపై కొట్టించుకుని గాయపరుచుకున్నాడని పోలీసుల కథనం.
హత్య తర్వాత ఇనుప రాడ్‌ను పవన్ తాడేపల్లి దగ్గర కాలువలో పడేశాడు. ఈ కేసులో మరో నిందితుడు పవన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పవన్ తన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అతని స్నేహితులు, బంధువుల ద్వారా పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.