Kajal Jha who is gangster ravi kana girlfriend rs 100 crore bungalow sealed in Delhi
Kajal Jha: సౌత్ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని విలాసవంతమైన ఓ మూడంస్తుల భవంతిపై నోయిడా పోలీసులు పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకను ముందే పసిగట్టి అందులోని వారు ముందే అక్కడి నుంచి పారిపోయారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే ఆ భవనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అసలు పోలీసులు ఈ భవంతిలో ఎందుకు సోదాలు జరిపారు. అక్కడి నుంచి తప్పించుకున్న వారు ఎవరు?
కోట్లకు పడగలెత్తిన రవి కానా
స్క్రాప్ మెటల్ మాఫియాపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంట్లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ రవి కానా, అతని ముఠాతో ముడిపడి ఉన్న 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీల్ చేశారు. రవి కానా అసలు పేరు రవీంద్ర నగార్. 16 మంది సభ్యులతో ముఠాను అతడు నడుపుతున్నాడు. మెటల్, స్క్రాప్ మెటీరియల్ అక్రమ సేకరణ, విక్రయాలతో అతడు కోట్లకు పడగలెత్తాడు. రవి కానా సోదరుడు హరేంద్ర ప్రధాన్ కూడా గ్రేటర్ నోయిడాలో గ్యాంగ్‌స్టర్ గా చెలామణి అయ్యాడు. 2014లో ప్రత్యర్థి ముఠా చేతిలో అతడు ప్రాణాలు కోల్పోవడంతో రవి కానా పగ్గాలు చేపట్టాడు. ఒకానొక దశలో ప్రత్యర్థుల నుంచి చంపేస్తామని బెదిరింపులు రావడంతో అతడికి పోలీసు రక్షణ కూడా కల్పించారు. పోలీసులతో కలిసి రవి కానా పెళ్లికి వెళ్లిన వీడియో ఒకటి గతంలో వైరల్ అయింది.
రవి కానా ముఠాపై 11 కేసులు
కిడ్నాప్, దొంగతనం ఆరోపణలతో రవి కానా, అతడి ముఠాపై 11 కేసులు ఉన్నాయని గ్రేటర్ నోయిడా సీనియర్ పోలీసు అధికారి సాద్ మియా ఖాన్ మీడియాతో చెప్పారు. అతడి గ్యాంగ్ లోని ఆరుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్టు తెలిపారు. గ్రేటర్ నోయిడాలో ఈ ముఠా ఉపయోగించే అనేక స్క్రాప్ గోడౌన్లపై దాడి చేసి సీలు వేశారు పోలీసులు. ప్రియురాలు, తన ముఠాలోని ఇతర సభ్యులతో కలిసి రవి కానా పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: నైట్ షిఫ్ట్ జాబ్ చేయడానికి వెళ్లిన అమ్మాయి అదృశ్యం.. ఇంతకు ముందు కూడా..
ఎవరీ కాజల్ ఝా?
రవి కానా ప్రియురాలే కాజల్ ఝా. సౌత్ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని విలాసవంతమైన భవంతి ఈమెదే. 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భవనాన్ని తన ప్రియురాలికి రవి కానా కానుకగా ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. రవి, కాజల్ పరిచయం విచిత్రంగా జరిగింది. ఉద్యోగం కోసం రవిని కలిసింది కాజల్. తర్వాత అతడి గ్యాంగ్‌లో చేరిపోయి అతి ముఖ్యమైన సభ్యురాలిగా మారిపోయింది. అతని బినామీ ఆస్తులన్నింటికి సంబంధించిన కీలక విషయాలన్నింటినీ ఆమెనే చూసుకునేది. తాజాగా ప్రియుడితో కలిసి ఆమె పరారైంది.