కందుకూరు జ్యువెలరీ షాపులో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

ఈ అన్నదమ్ముళ్ల చోరకళకు ఎంతటి దుకాణం షట్టర్ అయినా.. ఇట్టే ఓపెన్ కావాల్సిందే. వీరి కళ్లల్లో పడితే ఆ సొమ్ము మాయం అవ్వాల్సిందే.

kandukur : జల్సాలకు అలవాటు పడ్డారు. చదువుకు స్వస్తి పలికారు. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని ఆశించారు. అందుకే దొంగ వృత్తిని ఎంచుకున్నారు అపూర్వ సోదరులు. ఈ అన్నదమ్ముళ్ల చోరకళకు ఎంతటి దుకాణం షట్టర్ అయినా.. ఇట్టే ఓపెన్ కావాల్సిందే. వీరి కళ్లల్లో పడితే ఆ సొమ్ము మాయం అవ్వాల్సిందే.

నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో సంచలనం రేకెత్తించిన జ్యువెలరీ షాపులో దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 59.46 లక్షల విలువజేసే 760 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.18లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరులోని పెద్దబజార్కు చెందిన అనుములశెట్టి శ్రీకాంత్ స్థానికంగా గాయత్రి జ్యువెలరీస్ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఈ నెల 7న రాత్రి షట్టర్ తాళాలను పగలగొట్టి, షాపులోని 760 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించారు. పక్కనే ఉన్న మూడు కిరాణా షాపుల్లో 25 వేలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

గాయత్రి జ్యువెలరీ షాపులో చోరీ చేసింది సీతారామపురం బెస్తకాలనీకి చెందిన ఎం.బాలనారాయణ, అతని తమ్ముడిగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితులు చోరీ చేసిన సొత్తును.. 8వ తేదీన ఆదివారం విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి.. చదువుకు స్వస్తి పలికినట్లు పోలీసులు తెలిపారు. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని ఆశించి.. దొంగలుగా మారారని చెప్పారు. వీరిద్దరూ దుకాణాల షట్టర్లు తొలగించి చోరీలకు పాల్పడుతుంటారని వెల్లడించారు.

Also Read : ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్, రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి.. వీడియో వైరల్..

నిందితులు బాలనారాయణ అతని తమ్ముడిపై పలు పోలీసుస్టేషన్లలో చోరీ కేసులున్నాయి. బాలనారాయణపై ఒంగోలు, కందుకూరు, టంగుటూరు స్టేషన్లలో నమోదయ్యాయి. ఇతని తమ్ముడిపై కనిగిరి, పొదిలిలో రెండు చొప్పున కేసులు ఉన్నాయి. అలాగే ఒంగోలు, ఎస్ఆర్పురం, శ్రీకాకుళం జిల్లా పలాస, టంగుటూరులో ఒక్కో కేసు ఉంది. వీరిద్దరూ కందుకూరులోని జ్యువెలరీ దుకాణంలో దొంగతనం చేయడానికి ముందు ప్రకాశం జిల్లా టంగుటూరులోనూ చోరీకి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు