కాలేజీ క్యాంపస్‌లో యువతి దారుణ హత్య.. కర్ణాటకలో తీవ్ర కలకలం

పరీక్షలు రాసి కాలేజీ బయటకు వచ్చిన నేహపై అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఫయాజ్. తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే ఆమె ప్రాణాలు విడిచింది.

Hubballi college student death: కాలేజీ క్యాంపస్‌లోనే యువతి దారుణ హత్య కర్ణాటకలో కలకలం రేపింది. హుబ్బళ్లి నగరంలోని కేఎల్‌బీ టెక్నలాజికల్ యూనివర్సిటీ బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో గురువారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో నేహ హిరేమఠ(22) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలి కుమార్తె కావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభత్రలు క్షీణించాయని బీజేపీ విమర్శించింది. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. చట్టప్రకారం హంతకుడిని శిక్షిస్తామని తెలిపారు.

అసలేం జరిగింది?
హుబ్బళ్లి- ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (HDMC) కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నిరంజన్ హిరేమఠ కుమార్తె నేహ.. బీవీబీ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ చదువుతోంది. బెలగావి జిల్లా సవదత్తి ప్రాంతానికి చెందిన ఫయాజ్ కోండికొప్ప ఆమెతో కలిసి డిగ్రీ చదివాడు. కొంతకాలంగా ప్రేమించమని నేహను అతడు వేధిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఫయాజ్‌ను నిరంజన్ మందలించారు. దీంతో కోపం పెంచుకున్న అతడు గురువారం పరీక్షలు రాసి బయటకు వచ్చిన నేహపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే నేహ ప్రాణాలు విడిచింది. ఆమె మృతదేహాన్ని కెంపేగౌడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)కు తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

జ్యుడీషియల్ కస్టడీకి నిందితుడు
నిందితుడిని గంటలోపే అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపించామని హుబ్బళ్లి- ధార్వాడ్ పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార్ మీడియాతో చెప్పారు. ఇది చాలా తీవ్రమైన కేసు అని, హత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలతాయని అన్నారు. ఫయాజ్ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆరు నెలల క్రితం పరీక్షల్లో ఫెయిల్ కావడంతో అతడు కాలేజీకి వెళ్లడం లేదని, గురువారం కత్తితో కాలేజీకి వచ్చి ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. స్థానికులు సహాయంతో అతడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

శాంతిభద్రతలకు ఢోకా లేదు: సీఎం
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్ష బీజేపీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. హుబ్బళ్లి కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థిని హత్య వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని, తామే అదే చేస్తున్నామని చెప్పారు.

Also Read: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో విషాదం.. మైనర్ బాలుడి డ్రైవింగ్ వల్ల..

డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..
కర్ణాటకలో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనను బీజేపీ సాకుగా చూపుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన తెస్తామని ఓట్లరకు చెప్పడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లా అండ్‌ ఆర్డర్‌ బెస్ట్‌గా ఉందని.. హుబ్లీకాలేజీ విద్యార్థిని హత్య కేసులో చట్టం తన పని చేసుకుపోతుందన్నారు.

Also Read: 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. బెంగళూరు మహిళకు రూ.1.36 లక్షల జరిమానా..!

ట్రెండింగ్ వార్తలు