Visakha Kidney Racket Case
Visakha Kidney Racket Case : ఏపీలో సంచలనం రేపిన విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో పురోగతి లభించింది. కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు కామరాజు, శ్రీను పోలీసుల ఎదుట లొంగిపోయారు. కీలక సూత్రధారుల కోసం వేట మొదలు పెట్టిన పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు మధురవాడలో బాధితుడు వినయ్ కుమార్ ను డీఎంహెచ్ఓ జగదీశ్వర్ పరామర్శించారు. టెస్ట్ చేయించిన మెడికల్ ల్యాబ్ గురించి ఆయన ఆరా తీస్తున్నారు. కిడ్నీ వ్యవహారానికి సంబంధించి వినయ్ కుమార్ ను ప్రశ్నించారు డీఎంహెచ్ఓ.
కిడ్నీ మార్పిడి చేయాలంటే అనేక రిపోర్టులు ఉండాలని, కానీ వినయ్ కుమార్ దగ్గర ఒక రిపోర్టు కూడా లేదని డీఎంహెచ్ఓ జగదీశ్వర్ అన్నారు. వినయ్ ను తీసుకెళ్లిన వారి దగ్గర కచ్చితంగా రిపోర్టు ఉండవచ్చన్నారు. తిరుమల ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవని, కానీ మార్పిడికి సంబంధించి రెండు ఆపరేషన్ థియేటర్లు అందులో ఉన్నాయని ఆయన అన్నారు.
Also Read..Visakha Kidney Racket Case : విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు
తిరుమల ఆసుపత్రిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవని, కనీసం తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని గుర్తించారు. ఆసుపత్రిలో ఆర్దోపెడిక్ డాక్టర్ పరమేశ్వర్ రావును ప్రశ్నించగా, తిరుమల ఆసుపత్రిలో ఎటువంటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. మరో డాక్టర్ పరారీలో ఉన్నాడని, అతడు దొరికితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని డీఎంహెచ్ఓ జగదీశ్వర్ తెలిపారు.
కిడ్నీ రాకెట్ కేసు.. చైన్ లింక్ వ్యవహారంగా చెప్పుకుంటున్నారు. కేవలం వినయ్ కుమార్ మాత్రమే కాదు.. అనేకమంది తిరుమల హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం డబ్బుకు ఆశపడి వీళ్లంతా కిడ్నీలు అమ్ముకున్నారు. కిడ్నీ మార్పిడి వ్యవహారం వాంబే కాలనీలో సంచలనంగా మారింది. ఈజీ మనీ కోసం తమ అవయవాలు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. పోలీసులతో పాటు జిల్లా అధికారులను హాస్పటల్ కి పంపించారు. ఇప్పటికే తిరుమల ఆసుపత్రిలో డీఎంహెచ్ఓ విచారణ పూర్తైంది.
ఆర్దోపెడిక్ డాక్టర్ పరమేశ్వర్ రావును పోలీసులు, డీఎంహెఓ విచారించారు. ఆర్దోపెడిక్ సంబంధించిన వైద్యం మాత్రమే చేస్తున్నట్లు, ఆపరేషన్ కు సంబంధించి ఎలాంటి నిర్వహణ లేదని కూడా పరమేశ్వర్ చెప్పారు. అయితే, అక్కడ అవయవ మార్పిడికి సంబంధించి అక్కడ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉందని డీఎంహెచ్ఓ పరిశీలనలో తేలింది. అయితే, ఆ ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్ కి అందజేస్తామన్నారు డీఎంహెచ్ఓ. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్ చేస్తామన్నారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని తుంగలోకి తొక్కేశారు. బంధువులు ఇస్తే మాత్రమే అవయవాలు సేకరించాలి. దానికి కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని కూడా పాటించలేదు.
Also Read..Visakha Swetha Case : విశాఖ శ్వేత కేసులో మరో సంచలనం
థర్డ్ పార్టీ ద్వారా ఆర్గన్స్ మార్పిడీ చేయడం జరిగింది. మెడికల్ బోర్డు అనుమతులు తీసుకున్న తర్వాతే అవయవమార్పిడి చేయాల్సి ఉంటుంది. అది కూడా నెంబర్ వైజ్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారంలో స్రవంతి అనే డాక్టర్ కీలకంగా వ్యవహరించింది. స్రవంతికి, మధ్యవర్తులకు ఎలా పరిచయం ఏర్పడింది? అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డాక్టర్, మధ్యవర్తులు అంతా దొరికితే డొంకంతా కదిలే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి.