గతేడాది జులై లో రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో బీ ఫార్మశీ విద్యార్ధినిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు రవిశేఖర్ కు రంగారెడ్డిజిల్లా ఒకటో ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు 90 వేల రూపాయల జరిమానా… యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా దావులూరు కు చెందిన ఎ. రవిశేఖర్(48) వ్యవసాయం చేసుకునేవాడు. పలు పేర్లతో ఇతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎంతో మందిని మోసం చేసి నేరస్ధుడిగా మారాడు. కర్ణాటకలో ఇతనిపై 40 కి పైగా కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయి.
2019, జులై 23న ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ప్రాంతంలో టీ కొట్టు వ్యాపారి ఎలిమినేటి యాదయ్య కుమార్తె సోని ని(21) కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గాలింపు చేపట్టారు.
నిందితుడు యువతిని కారులో కర్నూలు,కడప, గుంటూరు జిల్లాల్లో తిప్పుతూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరికి అతడి చెర నుంచి తప్పించుకుని ఆమె హైదరాబాద్ కు చేరుకుని పోలీసులకు జరిగిన ఘటనలను వివరించింది. 2019 ఆగస్టు 3న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారిపై పంతంగిటోల్ గేట్ వద్ద రాచకొండ పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. రాచకొండ పోలీసులు రవిశేఖర్ పై పీడీయాక్టు విధించారు.
ఐపీసీ సెక్షన్ 366, 354, 506, 376(2)ఎన్,417, 420, 70 కింద కేసులు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. పోలీసులు కేసు విచారణను వేగవంతం చేయాలని కోర్టును అభ్యర్ధించారు. గత నెల ఫిబ్రవరి 13న మొదలై కేవలం నెల రోజుల్లో 27 మంది సాక్షులను విచారించారు. నిందితుడిపై మోపిన అభియోగాలను ప్రాసిక్యూషన్ విజయవంతంగా కోర్టులో నిరూపించగలగటంతో న్యాయమూర్తి గురువారం మార్చి19న తుది తీర్పు వెలువరించారు. నిందితుడికి విధించిన జరిమానాలోంచి రూ.50 వేలను బాధిత యువతి నష్ట పరిహారంగా కూడా పొందవచ్చని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.