Vinod Kumar Jain(Photo : Google)
Vinod Kumar Jain : ఏపీలో సంచలనం రేపిన విజయవాడకు చెందిన 14ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడు వినోద్ కుమార్ జైన్ కు జీవితకాల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.3లక్షల జరిమానా వేసింది. సెక్షన్ 305 కింద జీవిత కాల జైలు శిక్ష వేసింది. పోక్సో యాక్ట్ 9, 10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
పోక్సో యాక్ట్ 9, 10, 12 కింద రూ.50వేలు.. ఐపీసీ 305, 354 కింద రూ.2 లక్షలు, సెక్షన్ 509 కింద రూ. 50వేలు.. మొత్తం 3లక్షలు జరిమానా వేసింది. బాధితురాలి తల్లికి రూ.2లక్షల 40వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మైనర్ బాలికను లైంగికంగా వేధించి ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యాడు వినోద్ జైన్. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. గతేడాది విజయవాడ భవానీపురంలో లైంగిక వేధింపులు తాళలేక మైనర్ బాలిక అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
నా కూతురి ఆత్మకు శాంతి కలుగుతుంది-బాలిక తల్లి మాధురి
కోర్టు తీర్పుపై బాలిక తల్లి మాధురి హర్షం వ్యక్తం చేశారు. వినోద్ జైన్ కు జీవితకాల శిక్ష పడటం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి దుర్మార్గులకు జీవితకాల శిక్ష కాదు ఉరిశిక్ష పడాలి అని అన్నారు. తన కూతురి మరణానికి కారణమైన వినోద్ జైన్ కు ఇలాంటి శిక్ష పడినందుకు పైనున్న తన కూతురి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చిన్నపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారికి కోర్టులు కఠినమైన శిక్ష వేయాలన్నారు. అభంశుభం తెలియని నా కుమార్తెను వేధింపులకు గురి చేశాడన్నారు. చట్టం, న్యాయం గెలిచాయని బాలిక తల్లి మాధురి అన్నారు. ఈ కేసులో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మాధురి.
ఆ కిరాతకుడికి ఉరిశిక్ష పడాలని కోరుకున్నాం- బాలిక తాతయ్య మాచలరావు
రెండేళ్ల వయస్సున్నప్పుడు మనవరాలితో లోటస్ అపార్ట్ మెంట్ లో అడుగుపెట్టాం. వినోద్ కుమార్ జైన్ చిన్న కుమారుడికి కూడా అప్పుడు రెండేళ్ల వయసు. అలాంటి వినోద్ జైన్ నా మనమరాలిని అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. మాకు చెప్పుకోలేని విధంగా వినోద్ జైన్ మా మనవరాలిని ఇబ్బంది పెట్టాడు.
Also Read..Visakha Swetha Case : విశాఖ శ్వేత మృతి కేసులో కీలక విషయాలు.. ఆ లెటర్‌లో ఏముందంటే
ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో అనే భయంతో నా మనవరాలు అపార్ట్ మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వినోద్ కు జీవితకాల శిక్ష పడటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కిరాతకుడికి ఉరిశిక్ష పడాలని మేము అనుకున్నాం. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించడు. వినోద్ కి జీవితకాల శిక్ష పడటం వల్ల పైనున్న నా మనవరాలి ఆత్మ శాంతిస్తుంది. చట్టం, న్యాయం గెలిచాయి. జీవితకాల శిక్ష పటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దుర్మార్గులకు ఉరిశిక్ష పడాలని మేము కోరుకున్నాం.