మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో కీలక పరిణామం.. రూ.580 కోట్ల ఆస్తులు ఫ్రీజ్

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిక్రేవాల్‌కు చెందిన 580 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ స్తంభింపజేసింది.

Mahadev betting app case: ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ కొరడా ఝులిపించింది. హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిక్రేవాల్‌కు చెందిన 580 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. మరోవైపు యాప్‌తో కుమ్మక్కై మనీ ల్యాండరింగ్ నెట్‌వర్క్ సాగిస్తున్న పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో 3 కోట్ల 64 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంది.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు దాదాపు 9 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. 1200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 28న కోల్‌కతా, గురుగ్రామ్, ఢిల్లీ, ఇండోర్, ముంబై, రాయ్‌పుర్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో 1 కోటి 86 లక్షల నగదు, కోటీ 78 లక్షల విలువైన వస్తువులను ఈడీ స్వాధీనం చేసుకుంది.

మహాదేవ్ యాప్‌కు ప్రధాన ప్రమోటర్లుగా సౌరభ్ చంద్రకార్, రవి ఉన్నారు. ఈ నేర సామ్రాజ్యం అక్రమ ఆదాయం మొత్తం 6 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా ఇద్దరు ప్రమోటర్లను సైతం ఇటీవల దుబాయ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది.

Also Read: బెంగళూరులో బాంబు పేలుడు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్..!

ట్రెండింగ్ వార్తలు