మంత్ర వైద్యుడు చెప్పాడని: నానమ్మను గొడ్డలితో నరికి చంపాడు

  • Publish Date - October 30, 2019 / 07:34 AM IST

సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ఈ అత్యాధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాలు ఇంకా వదిలిపోలేదు. సమాజంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి మూఢ నమ్మకాలకు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాల పేరుతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇదే మూఢ నమ్మకం.. ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.

మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి తన నానమ్మను గొడ్డలితో నరికి చంపేశాడు మనమడు. ఈ ఘటన జార్ఖండ్ లోని పశ్చిమ సింగభూమ్ జిల్లాలో బాలిబంద్ ముండా టోలా గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాలిబంద్ టోలా గ్రామంలో విజయ్ బిరుయా అనే గిరిజన వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 

కొన్ని నెలలుగా విజయ్ భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. తన భార్య అనారోగ్యానికి చేతబడే కారణమని అనుమానంతో నానమ్మను నరికి చంపినట్టు మజ్హాగాన్ పోలీసు స్టేషన్ ఇంఛార్జ్ అకీల్ అహ్మద్ తెలిపారు.

అదే గ్రామంలో ఉండే ఓ మంత్ర వైద్యుడు చెప్పిన మాటలు నమ్మిన విజయ్.. తన నానమ్మ మాంత్రికురాలుగా అనుమానించి చంపేసినట్టు విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం మృతురాలు నానిక్ బిరుయా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.