గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 24మంది దుర్మరణం, మృతుల్లో 12మంది చిన్నారులు

అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ కావడంతో గేమింగ్ జోన్ లో రద్దీ పెరిగింది.

Rajkot Game Zone Fire : గుజరాత్ లోని రాజ్ కోట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 24మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ కావడంతో గేమింగ్ జోన్ లో రద్దీ పెరిగింది. ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో దారుణం జరిగిపోయింది.

ఈ అగ్నిప్రమాద ఘటనలో 24మంది చనిపోయారు. మృతుల్లో 12మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీకెండ్ కావడంతో అనేకమంది ఆడుకోవడానికి గేమ్ జోన్ కి వచ్చారు. అయితే, అగ్నిప్రమాదం పెను విషాదం నింపింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని రాజ్ కోట్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. సాయంత్రం వేళ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల వంద మంది వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో అనేకమంది భయంతో బయటకు పరుగులు తీశారు. కొంతమంది బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? మరో కారణం వల్ల జరిగిందా? అన్నది దర్యాఫ్తులో తేలాల్సి ఉంది. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది.

ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. గేమింగ్ జోన్ నిర్వాహకుడు యువరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అటు రాజ్ కోట్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని మోదీ. గుజరాత్ సీఎంకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరం అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..

ట్రెండింగ్ వార్తలు