నిరుద్యోగులూ బీ అలర్ట్.. సాఫ్ట్‌వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం, రూ.10 కోట్లతో పరార్

వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు కట్టారు. కొన్ని రోజులు వారికి మాదాపూర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు నమ్మించారు.

Software Job Fraud : నిరుద్యోగులే వారి టార్గెట్. మంచి జీతాలు ఇచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఊరిస్తారు. వారిని నమ్మించేందుకు ఫేక్ కంపెనీలను సైతం సృష్టిస్తున్నారు. తీరా చేతికి డబ్బులు అందాక బోర్డు తిప్పేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి మోసం ఒకటి వెలుగుచూసింది.

హైదరాబాద్ మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది.

అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు కట్టారు. కొన్ని రోజులు వారికి మాదాపూర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు నమ్మించారు. మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు కాగానే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు.

ఆగస్టు 17వ తేదీ ఉదయం ట్రైనింగ్ కోసం వెళ్లిన నిరుద్యోగులు ఆఫీస్ కి తాళాలు వేసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించి వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

”మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తామన్నారు. తర్వాత జాబ్ లోకి తీసుకుంటామన్నారు. ముందు డబ్బు కట్టాలని చెప్పారు. తర్వాత నెలకు 15వేలు జీతం ఇస్తామన్నారు. ఆ తర్వాత రూ.25వేల జీతం ఇస్తామన్నారు. మేము జీతం గురించి ఆశించలేదు. మాకు అనుభవం వస్తుందని ఆశించాము. ఇక్కడ ఉద్యోగం చేశాక మరో కంపెనీకి వెళ్దామనే ఆశలు పెట్టుకున్నాం. కానీ, మమ్మల్ని మోసం చేశారు. నట్టేట ముంచారు. పోలీసులు మాకు న్యాయం చేయాలి. ఏపీలో ఈ కంపెనీ వాళ్లకు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీల సపోర్ట్ ఉందని తెలుస్తోంది” అని ఓ బాధితుడు వాపోయాడు.

Also Read : కోల్‌కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది? కనిపించే దేవుళ్లకు భద్రత ఏది?