Meghalaya Honeymoon Case: హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పకడ్బందీగా ప్లాన్ చేసి భర్తను భార్య సోనమ్ చంపించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
హనీమూన్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. భర్త హత్య తర్వాత భార్య సోనమ్ రెండు వారాల పాటు కనిపించకుండా పోయింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హైవే దాబా వద్ద ఆమెను గుర్తించారు. కాశీ దాబా ఓనర్ ఫోన్ నుంచి తన సోదరుడితో సోనమ్చేసింది. దాంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. యూపీ పోలీసులతో ఇండోర్ పోలీసులు మాట్లాడారు. సోనమ్ లొకేషన్ ను కనుగొన్నారు. నంద్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనమ్ ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో సోనమ్ కీలక విషయాలు చెప్పింది. నా భర్తను నేను చంపలేదు. నలుగురు వ్యక్తులు ఆభరణాల కోసం నా భర్తను చంపేశారు అని తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, ఆకాశ్ రాజ్ పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి ఉన్నారు.
రాజా రఘువంశీ హత్య ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని సోనమ్ చెప్పింది. అయితే రాజా రఘువంశీ హత్య తర్వాత 16 రోజులు తాను ఎక్కడ ఉంది చెప్పడానికి ఆమె నిరాకరించింది. మేఘాలయ వాటర్ ఫాల్స్ నుంచి ఎలా తప్పించుకుంది కూడా చెప్పలేదు. మేఘాలయ వాటర్ ఫాల్స్ దగ్గర రాజా డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.
రాజా రఘువంశీ హత్యలో తన పాత్ర లేదని ఆమె నొక్కి చెప్పినప్పటికీ, గత 16 రోజులుగా తాను ఎక్కడ ఉన్నది, రాజా మృతదేహం దొరికిన మేఘాలయ జలపాతాల దగ్గర ఎలా తప్పించుకుంది, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి-ఘాజీపూర్ హైవేపై ఉన్న కాశీ ధాబాకు ఎలా చేరుకుంది వివరించడానికి సోనమ్ నిరాకరించింది. కాశీ దాబా అటవీ లోయ నుండి దాదాపు 1,200 కి.మీ. దూరంలో ఉంది.
ఈ ప్రశ్నలకు ఆమె మౌనంగా ఉండటం పోలీసుల్లో మరిన్ని అనుమానాలు పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపింది. ఈ కేసును SDRF, NDRF, నిఘా సంస్థలు సహా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఇరు కుటుంబాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.
“ఆమె చాలా భయపడిపోయింది, మాట్లాడలేకపోయింది” అని సంఘటన స్థలంలో ఉన్న ఒక మహిళ.. పోలీసులకు తెలిపింది. ధాబా యజమాని సాహిల్ యాదవ్ కూడా వాంగ్మూలం ఇచ్చారు. నార్త్ ఈస్ట్ ట్రిప్ లో ఉన్న సోనమ్.. ట్రిప్ మొత్తం తన లైవ్ లొకేషన్ ని తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో షేర్ చేసుకుందని ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్పీ ఆరోపించారు. హంతకులు గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తర్వాత నూతన వధూవరులను వెంబడించడం ప్రారంభించారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
రాజ్ ఇండోర్‌లోనే ఉండగా, అతని సహచరులు ఆకాష్, విశాల్, ఆనంద్ ఈ ప్రణాళికను అమలు చేయడానికి రైల్లో అస్సాంకు ప్రయాణించారని ఆరోపణలు ఉన్నాయి. “హత్య చేసేందుకు ఆయుధాన్ని గౌహతిలో కొనుగోలు చేశారు” అని ఇండోర్‌లోని ఒక అధికారి తెలిపారు. షిల్లాంగ్‌లో మరికొన్ని రోజులు ఉండాలని రాజాపై సోనమ్ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు అనిపిస్తోంది, నిందితులను విచారించిన తర్వాత మేము అన్నీ ధృవీకరిస్తాము అని పోలీసులు వెల్లడించారు.
“సోనమ్ తనతో పెద్దగా మాట్లాడటం లేదని రాజా ఒకసారి నాకు చెప్పాడు. ఆమె అతని పట్ల ఆసక్తి చూపడం లేదని అతను భావించాడు. నేను దాని గురించి ఆమెను అడిగినప్పుడు, ఆమె ఆఫీసు పనిలో బిజీగా ఉందని చెప్పింది. నువ్వు పట్టించుకోకపోతే రాజా బాధపడతాడని నేను ఆమెకు చెప్పాను. నా కొడుకుతో ఎక్కువగా మాట్లాడమని ఆమెను కోరాను. ఆమె నాతో చాలా ముద్దుగా మాట్లాడింది. ఆమె ఏం దాచి పెడుతుందో నాకు తెలియదు” అని రాజా రఘువంశీ తల్లి ఉమ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
”ఆమె బలవంతంగా పెళ్లి చేసుకుంటే, నా కొడుకును వదిలేసి ఉండొచ్చు లేదా పారిపోయి ఉండొచ్చు. అన్యాయంగా నా కొడుకుని ఎందుకు చంపింది?” అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు రాజా తల్లి ఉమ. “రాజా ఏ తప్పు చేయలేదు. సోనమ్ ను ప్రేమించాడు. మేము ఆమెను హృదయపూర్వకంగా అంగీకరించాము. ఆమె మా కోడలైంది. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టింది. ఆభరణాలు వేసుకుని రావాల్సిందేనని నా కొడుకుపై ఒత్తిడి తెచ్చింది” అని మృతుడి తల్లి ఉమ బోరున విలపించారు. రాజా రఘువంశీ వయసు 28ఏళ్లు. ట్రాన్స్ పోర్టర్ గా పని చేసేవాడు. మే 11న సోనమ్ తో అతడికి పెళ్లి జరిగింది.