వామ్మో.. ఇలాకూడా మోసం చేస్తారా..! నకిలీ కోర్టు సృష్టించి.. నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి కోటిన్నర కొట్టేశారు..
నకిలీ కోర్టును సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి నేరగాళ్లు కోటిన్నర నగదును కొట్టేశారు.

Cyber Crime : సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేయడంలో కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. అమాయకులను టార్గెట్ చేసి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అనేకమంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని కోట్లాది రూపాయలు పొగొట్టుకుంటున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా కొందరు మోసాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా.. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి మరీ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఏకంగా కోటిన్నర కొట్టేశారు.
Also Read: చనిపోయాక ఏం జరుగుతుంది?.. ఇదిగో ఈమె చూసిందట.. ఏం చెబుతుందో వినండి..
నకిలీ కోర్టును సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి నేరగాళ్లు డబ్బులు కాజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి కేటుగాళ్లు దాదాపు కోటిన్నర కాజేశారు. మాజీ చీఫ్ ఇంజనీర్ కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. ఒక కేసులో మీ పేరు వచ్చిందని భయపెట్టారు. కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని, ఈ కేసును జస్టిస్ స్వయంగా విచారిస్తున్నారని మాయమాటలు చెప్పారు. జస్టిస్ వీడియోకాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని చెప్పారు.
కొన్ని నిమిషాల్లోనే నకిలీ జస్టిస్ వీడియో కాల్ లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉంది అరెస్టు చేయాల్సి ఉంటుందని రిటైర్డ్ ఇంజనీర్ ను హెచ్చరించాడు. కేసు విషయమై డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని నకిలీ జడ్జి సూచించాడు. మీ డబ్బులు కేసు అయిపోగానే తిరిగి వస్తాయంటూ చెప్పాడు. నకిలీ జడ్జి చెప్పిన విధంగా రిటైర్డ్ ఇంజనీర్ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేశాడు. దాదాపు రూ. 1.50 కోట్లను డిపాజిట్ చేశాడు.
డబ్బులు తిరిగిరాకపోవడంతో మోసపోయానని గుర్తించి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. తనకు వచ్చిన ఫోన్ కాల్, డబ్బులు ఏ విధంగా డిపాజిట్ చేశాడో అనే విషయాన్ని పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.