Mumbai Building Fire, Mumbai Residential Building Fire, Bhatia Hospital, Nair Hospital
Mumbai Building Fire : ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 20 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 18వ అంతస్తులో మంటలు వ్యాపించడంతో పలు ఫ్లాట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది దట్టమైన పొగతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని నివాస భవనంలోని 18వ అంతస్తులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.
స్థానిక గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న భవనంలో శనివారం ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. భవనం వద్దకు 13 ఫైర్ ఇంజన్లు, 7 వాటర్ జెట్టీలతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి.
ఈ అగ్నిప్రమాద ఘటనపై బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు స్పందించారు. లెవల్-3 అగ్నిప్రమాదంగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని, శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని దగ్గరలోని భాటియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడిన ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్ అందించినట్టు వైద్యాధికారులు తెలిపారు. భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయని, కానీ, దట్టమైన పొగ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Also : World War 2: రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి “మిస్సింగ్ ఫ్లైట్” 80 ఏళ్ల తరువాత భారత్ లో దొరికింది