కరీంనగర్ విద్యార్థిని రాధిక హత్య..న్యూ ట్విస్ట్

  • Publish Date - February 10, 2020 / 06:39 PM IST

కరీంనగర్‌లో విద్యార్థి రాధిక హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. రాధిక ఇంట్లోని బీరువాలో లక్ష రూపాయల నగదు.. 4 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు దుండగుడు. రాధిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. కత్తితో దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన పక్కింటి బాలుడు.. స్థానికులకు సమాచారం అందించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే రాధిక కన్నుమూసింది.

సహస్ర కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ 
రాధిక తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ.. అమెను చదివిస్తున్నారు. సహస్ర కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రాధిక కాలేజ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఎప్పటిలాగానే తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లారు. పొలం పని ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. పొలంలో పనులు చేసుకుంటున్న తమకు.. పక్కింటివాళ్లు సమాచారం అందించారని, వెంటనే ఇంటికి చేరుకున్నట్లు రాధిక తల్లిదండ్రులు వెల్లడించారు. విగతజీవిగా పడి ఉన్న తమ బిడ్డను చూసి గుండెలవిసేలా రోదించారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రి గంగుల
మరోవైపు తమకు ఎవరూ శత్రువులు లేరని.. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారో తెలియదంటున్నారు రాధిక తల్లిదండ్రులు. ఎవరిపై తమకు అనుమానం లేదని చెబుతున్నారు. 
రాధిక హత్య జరిగిన స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్‌లో ఇలాంటి దారుణ ఘటన జరగడం బాధాకరమన్నారు. తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల్లో హత్య చేసిన వారిని పట్టుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.