2020లోనే నిర్భయ దోషులకు ఉరిశిక్ష

  • Publish Date - December 18, 2019 / 11:14 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార  హత్య కేసులో  దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే. మరణ శిక్షకు ముందు ఉన్న అన్ని న్యాయ పరమైన అవకాశాలను  వినియోగించుకునేందుకు పాటియాలా కోర్టు దోషులకు వారంరోజులు గడువు ఇచ్చింది.  

నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దోషికి సమీక్ష కోరే హక్కు లేదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు దోషుల తరఫు న్యాయవాది మూడు వారాల గడువు కోరినా… క్షమాభిక్షకు వారం రోజులు చాలని తెలిపింది. మరోవైపు 14 రోజుల్లోగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు  పాటియాలా కోర్టును కోరారు. 

సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఈ పిటీషన్ వాయిదా వేసిన న్యాయస్ధానం  నేడు  విచారణ జరిపింది  సర్వోన్నత న్యాయస్ధానం రివ్యూ పిటీషన్ ను కొట్టి వేసేందుకు డెత్ వారంట్ జారీ చేసేందుకు  ఎలాంటి అడ్డంకులు లేవని నిర్బయ తల్లితరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.  అయితే న్యాయపరమైన అవాకాశాలు  పూర్తయిన తర్వాతే డెత్ వారంట్  జారీ చేయాలని నిందితుల తరుఫు న్యాయవాదులు కోరారు. ఇరు పక్షాల  వాదనలు విన్న న్యాయస్ధానం  దోషులకు మరో వారంరోజులు గడువు ఇవ్వాలని  తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. 

కన్నీరు పెట్టుకున్న నిర్భయ తల్లి 
సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై నిర్భయ తల్లి ఆశాదేవి  కోర్టు హాలులోనే ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లుపెట్టుకున్నారు. దోషుల హక్కుల గురించే కోర్టు పట్టించుకుందని, తమ హక్కులవు పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు.   దీనిపై స్పందిస్తూ న్యాయమూర్తి …. మీపై  మాకు పూర్తి సానుభూతి ఉంది.,కానీ దోషులకు హక్కులుంటాయి కదా..మీ  వాదనలు మేము వింటాం ..అదే సమయంలో  చట్టానికి లోబడి వ్యవహరిస్తాం అని హామీ ఇచ్చారు.  కేసు విచారణ వాయిదా వేసిన తర్వాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె.. పరిష్కారం కోసం దోషులకు సమయం కేటాయించి కోర్టు ఒకవైపు నుంచి మాత్రమే చూస్తుందని ఆమె మీడియాకు తెలిపారు.  తదుపరి విచారణ తర్వాత కూడా తీర్పు వస్తుందని మాకు నమ్మకం లేదంటూ స్పందించారు.