Noida Dowry Murder Case: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వరకట్నం హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి కాలికి గాయమైంది.
నిక్కీ భాటి వరకట్న హత్య కేసులో ప్రధాన నిందితుడు విపిన్ భాటిని శనివారం క్రైమ్ సీన్ కి తీసుకెళ్తుండగా కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విపిన్ ఒక అధికారి నుండి పిస్టల్ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కస్టడీ నుంచి పారిపోవాలని చూశాడు. ఈ క్రమంలో తమను తాము రక్షించుకోవడానికి కాల్పులు జరిపాల్సి వచ్చిందని, ఒక బుల్లెట్ అతని కాలికి తగిలిందని పోలీసులు తెలిపారు. సిర్సా చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తన కూతురిని బలితీసుకున్న విపిన్ ను ఎన్ కౌంటర్ చేయాలని, అతడి తల్లిదండ్రులను ఉరి తీయాలని నిక్కీ తండ్రి డిమాండ్ చేసిన కొన్ని గంటలకే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
కాలికి బుల్లెట్ గాయం కావడంతో విపిన్ ను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఏమైనా పశ్చాత్తాపం ఉందా అని పోలీసులు అడిగినప్పుడు, “నాకు పశ్చాత్తాపం లేదు. నేను ఆమెను చంపలేదు. ఆమె తనంతట తానుగా చనిపోయింది” అని విపిన్ చెబుతున్నాడు. అంతేకాదు.. మీరు మీ భార్యని కొడతారా అని అడిగినప్పుడు, “భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతుంటారు. ఇది చాలా సాధారణం” అని విపిన్ చెప్పడం విశేషం. వరకట్నం కోసం విపిన్ తన భార్య నిక్కీని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు విపిన్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఎన్‌కౌంటర్‌పై నిక్కీ తండ్రి స్పందించారు. పోలీసులు సరిగ్గానే వ్యవహరించారని అన్నారు. దోషిగా తేలిన వ్యక్తి మాత్రమే పారిపోవడానికి ప్రయత్నిస్తారని విపిన్ ను ఉద్దేశించి ఆయన అన్నారు. “పోలీసులు సరైన పని చేశారు. నేరస్తుడు ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. విపిన్ ఒక క్రిమినల్. మా అభ్యర్థన ఏమిటంటే మిగిలిన వారిని కూడా పట్టుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
”నిక్కీకి నిప్పంటించడానికి నిందితుడు వాడిన మండే ద్రవ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో, అతను ఒక పోలీసు తుపాకీని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు” అని గ్రేటర్ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ తెలిపారు.
“నిక్కీకి నిప్పటించడానికి ఉపయోగించిన మండే ద్రవ బాటిళ్లను అతడు విసిరేశాడు. వాటిని తిరిగి పొందడానికి మేము ఇక్కడికి వచ్చాము. మేము బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాము. కానీ ఆ సమయంలో, అతను ఇన్‌స్పెక్టర్ పిస్టల్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని చుట్టుముట్టినప్పుడు, అతను మాపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం, పోలీసులు కూడా కాల్పులు జరిపారు. బుల్లెట్ అతని కాలికి తగిలింది. గాయపడ్డ అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. మహిళకు నిప్పటించడానికి ఉపయోగించిన థిన్నర్ బాటిళ్లను మేము స్వాధీనం చేసుకున్నాము” అని గ్రేటర్ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ వివరించారు.
ఈ నెల 21న భర్త, అత్త మామలు నిక్కీపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం నిక్కీని వేధించారు. అదనంగా 35 లక్షలు తేవాలని టార్చర్ పెట్టారు. భర్త విపిన్.. భార్య జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో నిక్కీ స్పాట్ లోనే చనిపోయింది.